- ప్రమాదకర స్థాయిలో నదుల్లో నీటి ప్రవాహం
- తీవ్రంగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో రైతాంగం
ప్రజాశక్తి-యంత్రాంగం : తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పంటలు, గ్రామాలు నేటికీ నీటి ముంపులోనే ఉన్నాయి. దీంతో, రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. శబరి, నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి నదులు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం నగరం పాత వంతెన వద్ద నాగావళి నదిలో 40 వేల క్యూసెక్కులు, వంశధారలో 28 వేల క్యూసెక్కులు, బాహుదాలో 13 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ఆమదాలవలస మండలంలోని నారాయణపురం ఆనకట్ట ఎడమ కాలువ, దేశవాళిగడ్డ కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో వేలాది ఎకరాల పంట పొలాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. ఆమదాలవలస మండలంలో భారీగా వరద నీరు ప్రవహించడంతో ఆమదాలవలస–కొత్తవలస ప్రధాన రహదారిపైకి నీరు చేరింది. నాగావళిలో వరద ప్రవాహంతో బూర్జ మండలం అల్లెన, పనుకుపర్త, జి.బి.పురం తదితర గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. విజయనగరం జిల్లాలో కింజంగి మరువాడ, ఓని అగ్రహారం, శివ్వాం, శ్రీహరిపురం తదితర గ్రామాల్లో వరి చేలు నీట మునిగే ఉన్నాయి. భారీ వర్షాలకు వేపాడ మండలం కేజీపూడి రెవెన్యూ పరిధిలోని రాయుడు చెరువుకు రెండు చోట్ల గండి పడింది. పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి నిర్వాసిత గ్రామాలైన బాసంగి, తదితర గ్రామాలు వరద ముంపు నుంచి కాస్త తేరుకుంటున్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో *37 వేల ఎకరాల్లో వరికి నష్టం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 37 వేల ఎకరాల్లో వరి పంటకు, మరో రెండు వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో కొవ్వాడ కాలువ పొంగడంతో 200 పైగా ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామం ముంపులోనే ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మాదవపురం, సూరంపాలెం, గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు, తాటిపర్తి, జగ్గంపేటలో కాట్రావులపల్లి, మర్రిపాక, ఇర్రిపాక గ్రామాల్లో పంట పొలాలు నీటిలోనే నానుతున్నాయి. ఏలేరు కాలువ పొంగడంతో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో జగనన్న కాలనీ నీటమునిగింది. సామర్లకోట-తిమ్మాపురంలో కాలువకు సమాంతరంగా రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
భయపెడుతున్న ‘శబరి’
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టుల్లో సామర్థ్యానికి మించి ఉన్న నీటిని దిగువకు వదలడం, ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు శబరి నది ప్రవాహం భయపెడుతోంది. పోలవరం జిల్లా చింతూరు వద్ద శబరి నీటిమట్టం 42 అడుగుల నుంచి శనివారం సాయంత్రానికి 40 అడుగులకు తగ్గినా ఉధృతి కొనసాగుతోంది. ఒడిశాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరికొంత నీరు శబరిలోకి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 24 గంటల వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భద్రాచలంలో శుక్రవారం 20 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రానికి 27.2 అడుగులకు చేరుకుంది. శబరి ఉపనదులు సీలేరు, సోకిలేరు, చంద్రవంక వాగుల ఉధృతికి కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 5,38,238 క్యూసెక్కుల జలాలను ప్రాజెక్టు స్పిల్వే నుండి దిగువకు విడుదల చేసినట్లు డిఇఇ వెంకటేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 26 అడుగుల నీటిమట్టం ఉంది. రానున్న 24 గంటల్లో కొద్దిమేర ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం జిల్లాలోని ఏడుగురాళ్లపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి చేరిన నీరు అలానే ఉంది. విఆర్.పురం మండలంలో ముల్కనపల్లి పంచాయతీ పరిధి మడివి గుంపు-సిరియ గుంపు మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు, నిత్యావసరాల కోసం రాకపోకలు సాగించే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లూరి జిల్లా
జికె.వీధి మండలం ధారకొండ పంచాయతీ చిన్న గంగవరం వంతెన వరదలకు కొట్టుకుపోవడంతో 14 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోప్ సహాయంతో శనివారం ఉదయం ఒక్కొక్కరుగా వాగు అవతలకు దాటారు. ఆ సమయంలో ఏ మాత్రం పట్టుతప్పినా ప్రాణాలు పోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. డుంబ్రిగుడ మండలంలో వాగులు ప్రమాదకరంగానే ప్రవహిస్తున్నాయి. పోతంగి పంచాయతీ కోసంగి గ్రామానికి చెందిన వంతాల చంద్రశేఖర్ అస్వస్థతకు గురవడంతో చాపరాయి గెడ్డలో ఆయనను భుజంపై మోస్తూ కుటుంబీకులు డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ముంచింగిపుట్టు మండలంలోనూ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
కాటన్ బ్యారేజీ వద్ద స్వల్పంగా పెరిగిన నీటిమట్టం
ధవళేశ్వరలోని కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. శనివారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద తొమ్మిది అడుగుల నీటి మట్టం నమోదైంది. 175 గేట్లపైను పైకి లేపి సముద్రంలోకి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని, తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
చెరువులో మునిగి ఐదు గేదెలు మృతి
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్.ఎర్రవరం చెరువులో మునిగి ఐదు గేదెలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ.6 లక్షల ఉంటుందని అంచనా. తనను ఆదుకోవాలని బాధిత రైతు ఓదిరి కన్నబాబు ప్రభుత్వాన్ని కోరారు.
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలం పెదగూడ పంచాయతీ, గూడమాలిపుట్టు గ్రామంలో పెంకుటిల్లు కూలి పూజారి సూర్యనారాయణ (56) మృతి చెందారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరు సమీపంలోని సదాశివ రిజర్వాయర్‌లో శుక్రవారం రాత్రి పిడుగుపాటుకు కుక్కలగుంట గిరిజన కాలనీకి చెందిన వెంకటేష్ (36) మరణించారు. ఆయన తన భార్య వరలక్ష్మి, చిన్న కుమారుడు అంకయ్యతో కలిసి చేపల వేటకు వెళ్లారు. రిజర్వాయర్ వద్ద గుడారం ఏర్పాటు చేసుకుని ఉండగా పిడుగుపడటంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందారు. వరలక్ష్మి, అంకయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి.








కామెంట్‌లు (0)