ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల పర్యటన

22 గంటల క్రితం

పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల పర్యటన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 08:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పోలవరం : పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజుల పర్యటన ముగిసింది. ఈ నెల 14 నుంచి 17 వరకు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన నిపుణులు కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఇసిఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణ పనులు, నాణ్యతా నియంత్రణ పరీక్షలను పరిశీలించారు. గ్యాప్‌-1, 2 నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. నిర్మాణ నాణ్యత, పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పర్యటనలో మొత్తం 40 గంటలపాటు ప్రాజెక్టు పనులపై దృష్టి సారించిన నిపుణులు 13 గంటలు క్షేత్రస్థాయి పరిశీలనకు, 27 గంటలు సమీక్షా సమావేశాలకు కేటాయించారు. రిచర్డ్‌ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్‌ హించ్‌బెర్గర్‌, డేవిడ్‌ పాల్‌ ఈ పర్యటనలో పాల్గొన్నారు.

​గ్యాప్‌-1, 2 నిర్మాణాల పరిశీలన

​పర్యటనలో భాగంగా నిపుణులు ఇసిఆర్‌ఎఫ్‌ డ్యామ్‌లోని గ్యాప్‌-1, 2 నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని నాణ్యతా నియంత్రణ పరీక్షా కేంద్రాలను సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని పరిశీలన చేశారు. క్షేత్రస్థాయిలో పరీక్షలు జరిపి నిర్మాణ పనుల నాణ్యతను అంచనా వేశారు. ఇసిఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణం, పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ​పర్యటన చివరి రోజైన శనివారం నిపుణులైన పిపిఎ, రాష్ట్ర జలవనరుల శాఖ, ఎంఇఐఎల్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం వర్షాలు అంతగా లేకపోవడంతో నిర్మాణ పనుల వేగాన్ని పెంచాలని, నాణ్యత విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయొద్దని సూచించారు. పర్యటనలో పాల్గొన్న అంతర్జాతీయ నిపుణులతో పాటు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను పిపిఎ సిఇఒ సంజీవ్‌ వోహ్రా శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందించారు. సంజీవ్‌ వోహ్రాను రాష్ట్ర జలవనరుల శాఖ ఇఎన్‌సి కె.నరసింహమూర్తి సత్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్