- మతాలకు అతీతంగా మహిళలు ఉద్యమించాలి
- ఐద్వా ప్రధాన కార్యదర్శి కనినిక ఘోష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హక్కులు, రక్షణ కోసం మహిళలు పోరాటం చేయాలని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి కనినిక ఘోష్ బోస్ పిలుపునిచ్చారు. ఈ పోరాటం కులాలు, మతాలకు అతీతంగా సాగాలని కోరారు. విజయవాడలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఐద్వా జాతీయ కమిటీ సమావేశాలు శనివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, మహిళలపై పెద్దఎత్తున హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మనువాద ప్రభుత్వం మహిళకు, దళితులకు, ఆదివాసీలకు వ్యతిరేకమని తెలిపారు. ఈ మనువాద ప్రభుత్వంలో సామాజిక న్యాయం, హక్కులు కోల్పోతున్న పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ సాధించుకోవాలని తెలిపారు. పెద్ద ఎత్తున పెరుగుతున్న నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో మహిళలపై తీవ్ర ఆర్ధిక భారం పడుతోందన్నారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’(అందరూ బాగుండాలి, అందరూ అభివృద్ధి) చెందాలని కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నినాదం ఇచ్చిందన్నారు. ఈ నినాదం పేద ప్రజలు, సామాన్యులు, మహిళల కోసం ఇచ్చిన పిలుపు కాదన్నారు. ఈ నినాదం కార్పొరేట్ల కోసం ఇచ్చిన పిలుపు అని, మోడీ ప్రభుత్వంలో అదానీ, అంబానీ వంటి వారే వికసిస్తూ అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. సామాన్య ప్రజలకు రుణం కావాలంటే బ్యాంకులు తమ చుట్టూ తిప్పుకుంటున్నాయని, ఇచ్చిన ఈఎంఐ చెల్లించకపోతే అపరాధం రుసుం వసూలు చేస్తాయని పేర్కొన్నారు. కానీ జి సంస్థల అధినేత సుభాష్ చంద్రకు మాత్రం వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీలు అమలు చేయని ఎపి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఎన్నిక సమయంలో నెలకు రూ.1500ల చొప్పున ఇస్తామని, రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ రెండు హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఈ వాగ్దానాల అమలు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంఘం సీనియర్ నాయకురాలు ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ మహిళలపై అసమానతలు, వివక్ష, హింసకు వ్యతిరేకంగా ఐద్వా నిరంతరం పోరాడుతుందని అన్నారు.
రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులై పారుతున్నాయని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పెరుగుతున్న మత్తుపదార్ధాల వల్ల యువత వాటికి బానిసలుగా మారుతోందని, దీనివల్ల మహిళలు, బాలికల భద్రత ప్రశార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐద్వా సీనియర్ జాతీయ నాయకులు ఎస్ పుణ్యవతి, రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి ప్రసంగించిన ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు డి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఐద్వా జాతీయ నాయకురాలు సుభాషిణి ఆలీ రచించిన ‘సామాజిక న్యాయం-సంస్కరణ ఉద్యమాలు’ అనే పుస్తకాన్ని కనినిక ఘోష్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.








కామెంట్‌లు (0)