- ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం
- బాధితులందరికీ ఉచిత రేషన్
- కూలీల కుటుంబానికి రూ.10 వేలు
- సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తుపానుతో నష్టపోయిన ఉత్తరాంధ్ర రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం, బాధితులందరికీ ఉచిత రేషన్, కూలీల కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాయుగుండం ప్రభావంతో వచ్చిన తుపాను ఉత్తరాంధ్ర జిల్లాల రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించిందని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వందలాది గ్రామాల్లో వేలాది ఎకరాల్లో రైతులు వేసిన వరి, పత్తి, మిర్చి, అరటి, బొప్పాయి వంటి పంటలు చేతికొచ్చే దశలో నీటిపాలయ్యాయని తెలిపారు. పేదలు ఉపాధి కోల్పోయారని, తుపాను ప్రభావంతో నష్టపోయిన ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ఆదివాసీ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పేదలు కోలుకునేదాకా నిత్యావసరాలతో రేషన్, కూలీలకు రూ.10 వేలు ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. అసలే కరువుతో అల్లాడుతున్న ప్రజలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా తుపాను వచ్చి పడిందని, అందువల్ల యుద్ధ ప్రాతిపదికపై తుపాను బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాలని కోరారు. తుపాను తీరం దాటినా.. మూడు రోజులుగా ఒడిశాలో పడుతున్న వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాగావళి, జంఝావతి, స్వర్ణముఖి, వేగావతి నదులు ఉగ్రరూపం దాల్చాయని పేర్కొన్నారు. దీంతో నదీ పరివాహక గ్రామాలు ముంపునకు గురయ్యాయని, వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు పెద్దయెత్తున నష్టపోయారని పేర్కొన్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న పంటలు ఈ తుపాను వల్ల వచ్చిన వర్షాలతో చేతికొచ్చే దశలో పంటలు దెబ్బ తినడంతో రైతాంగం తీవ్రమైన ఆందోళనలో ఉన్నదని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 28 మండలాల్లో 382 గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని తెలిపారు. పాలకొండ, బూర్జ, లావేరు మండలాల్లో అనేక గ్రామాల్లో రైతులు వేసిన పంటలన్నీ పూర్తిగా నీటమునిగి దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రోడ్లు దెబ్బ తినడంతో 40 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయని వివరించారు. తోటపల్లి, జంఝావతి, మడ్డువలస ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి పెడుతుండటంతో నదీ పరివాహక గ్రామాలు ముంపునకు గురయ్యాయని వివరించారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయని, నాగావళి ఉధృతి వల్ల పలు గ్రామాలను వరద చుట్టుముట్టిందని పేర్కొన్నారు. ఎగువన ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశా నుండి వస్తున్న వరద నీటితో తుపాను కారణంగా విజయనగరం జిల్లాలో పంటనష్టం జరిగిందని, రాజోలి మండలంలో సుమారు 200 ఎకరాలు అరటి, పత్తి, మొక్కజొన్న పాడైందని, సోసేరు గ్రామంలోని ఓ రైతుకు చెందిన చేతికొచ్చిన పంట 15 ఎకరాల్లో నేలమట్టమై రూ.లక్షలు పెట్టుబడి పోయిందని వివరించారు. నెల్లిమర్ల మండలంలో 120 ఎకరాల పత్తి, 15 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగిందని తెలిపారు. చీపురుపల్లి మండలంలో 100 ఎకరాలకు పైగా పత్తి, బొప్పాయి, మొక్కజొన్న నేలకొరిగి లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని, పోలవరం జిల్లాలో చింతూరు డివిజన్ పరిధిలో శబరినది ఒక్కసారిగా పోటెత్తడంతో చింతూరు మండలం కుయిగూరు, సోకిలేరు, జల్లివారి గూడెంలో వరదనీరు గ్రామాల్లో ప్రవేశించిందని వివరించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద పోటెత్తుతోందని, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద శుక్రవారం సాయంత్రానికి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రికార్డు అయిందని, దీంతో కోనసీమ లంక గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలన్నింటినీ గుర్తించి ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)