- ద్రవ్యోల్బణం, ప్రభుత్వ విధానాలపై లక్షలాది మంది కార్మికులు, యువత నిరసన
యూరప్: యూరప్‌లో పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాల్లో లక్షలాది మంది కార్మికులు, విద్యార్థులు, యువత వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం వంటి దేశాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. విద్య, వైద్యం, గృహవసతి వంటి ప్రాథమిక అవసరాలకు ప్రభుత్వాలు మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫ్రాన్స్‌లో వరుసగా మూడో వారాంతం కూడా భారీ ప్రదర్శనలు జరిగాయి. పారిస్, మార్సెయిల్, లియోన్ నగరాల్లో అధికారిక అంచనాల ప్రకారం 3.2 లక్షల మంది పాల్గొన్నారు. అయితే ఐదు లక్షల మంది హాజరయ్యారని నిరసన నిర్వాహకులు తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ప్రభుత్వ ప్రజాసేవలను బలోపేతం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యా రంగంలోని సంక్షోభాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన ఈ నిరసనలను ఆ తర్వాత కార్మిక సంఘాలు, ఇతర ప్రజా ఉద్యమాలు చేపట్టాయి. మరోవైపు జర్మనీలోనూ యువత ఆందోళన బాట పట్టింది. 34నగరాల్లో జరిగిన నిరసనల్లో లక్ష మందికి పైగా పాల్గొన్నారు. విద్య, గృహ నిర్మాణ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని కోరారు. ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన నిరసనల అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ హింసాకాండతో తమకు ఎలాంటి సంబంధం లేదని నిరసన నిర్వాహకులు స్పష్టం చేశారు. స్పెయిన్, పోర్చుగల్‌లో పెరిగిన అద్దెలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇటలీలోనూ విద్యార్థులు, కార్మికులు మెరుగైన వేతనాలు, ప్రజా సేవలకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ప్రాథమిక అవసరాల కంటే ఆర్థిక విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవాలని నిరసనకారులు కోరుతున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. యూరప్ అంతటా విస్తరిస్తున్న ఈ కార్మిక, ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నాయి.








కామెంట్లు (0)