ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతాం

4 గంటల క్రితం

tourism
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 10:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రూ.94 కోట్లతో అఖండ గోదావరి పర్యాటకాభివృద్ధి

- పర్యాటక ప్రాంతాల్లో డిజిటల్‌ సమాచార వ్యవస్థ

- ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. రాష్ట్రంలోని సహజ వనరులు, సముద్రతీరం, పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, గిరిజన ప్రాంతాలు, ఆహార, సాంస్కృతిక ప్రత్యేకతలను పర్యాటక రంగంతో అనుసంధానం చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామనాన్రు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. సుమారు రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో స్థానిక కుటుంబాలు తమ ఇళ్లను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. అరకు కాఫీ, బాంబూ చికెన్‌ వంటి ప్రాంతీయ ప్రత్యేకతలతో పాటు సుమారు 21 జిఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులను పర్యాటకులతో అనుసంధానం చేయడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు మార్కెట్‌ పెంచవచ్చని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో డిజిటల్‌ సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. సుమారు 130 పర్యాటక ప్రాంతాల్లో క్యూఆర్‌ కోడ్‌లను ఏర్పాటు చేసి, వాటిని స్కాన్‌ చేయగానే ఆయా ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన ఇతర వివరాలు మొబైల్‌ ఫోన్‌లో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వంద నుంచి 120 భాషల్లో సమాచారాన్ని అందించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను 12 రోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నామన్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా చారిత్రక హేవలాక్‌ వంతెనను పరిరక్షిస్తూ ఐకానిక్‌ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీర్‌సింగ్‌ రావత్‌, ఎపిటిడిసి వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి చెకూరి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్