శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్హుందరికీ పింఛన్లు ఇస్తాం

48 నిమిషాల క్రితం

savitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 01:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ : మంత్రి సవిత

ప్రజాశక్తి-పెనుకొండ (శ్రీ సత్యసాయి జిల్లా) : అర్హులైన నేతన్నలందరికీ ఎన్‌‌టిఆర్ భరోసా పింఛన్లను అందజేస్తామని, పింఛన్ల కోసం ఎవరికీ ఒక్కరూపాయి కూడా ఇవ్వొద్దని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం రాష్ర్టంలోని అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన ఎన్‌‌టిఆర్‌ భరోసా పింఛన్లు, నేతన్నల సేవలో పథకం అమలు తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,521 దరఖాస్తులు వచ్చాయని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటింటికీ వెళ్లి అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84 వేలకుపైగా చేనేతలకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ శ్రీసత్యసాయి, అనంతపురం సహా పలు జిల్లాల్లో చేనేత పింఛన్ల దరఖాస్తుదారుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదన్నారు. ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరంలేదని తెలిపారు. అర్హత ఉంటే ప్రభుత్వమే పింఛన్‌ అందజేస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్..

శ్రీసత్యసాయి జిల్లాలో దరఖాస్తుల పరిశీలన సమయంలో తాము ఇచ్చే అనుమతులతోనే ‌పింఛన్లు వస్తాయంటూ డిఒ రమణారెడ్డి, ఎడిఒ శీనా నాయక్ నేతన్నల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి గండికొడుతున్న ఆ ఇద్దరు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్‌ ‌విధిస్తూ కమిషనర్ రేఖారాణి ఉత్తర్వులు జారీచేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్