పాడేరు (అల్లూరు) : ' గిరిజన ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ గిరిజనులకే దక్కాలనేది ఈ ప్రభుత్వ విధానం అని, అందరికీ ఆమోదయోగ్యమైన జిఒ ను మళ్లీ తీసుకువస్తామని హామీ ఇస్తున్నాను ` అని సిఎం చంద్రబాబు అన్నారు. శనివారం అల్లూరు జిల్లా అరకులోయ మండలం గన్నెలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ... ఏజెన్సీ ప్రాంతానికి వస్తే కొత్త శక్తి, ఉత్సాహం వస్తుందని అన్నారు. అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చామన్నారు. ఆ రోజుల్లోనే ఆయుర్వేద వైద్యం గిరిజనులకు అందించిన వ్యక్తి అల్లూరి సీతారామ రాజు అని చెప్పారు. ఆయన సేవలకు గుర్తుగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టాం అని తెలిపారు. సంజీవని యాప్ ఓ గేమ్ ఛేంజర్ అని అన్నారు. '' మీకు అనారోగ్యం వస్తే విశాఖ, పాడేరు వెళ్లాల్సి వచ్చేది. మీ ఆరోగ్యం మీ ఫోన్‌లో ఉంది. ఎక్కడికి వెళ్లినా మీ ఆరోగ్యం ఫోన్‌లో చెక్ చేసుకోవచ్చు. `` అని చెప్పారు. ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని సంకల్పించామన్నారు. గిరిజనుల ఆరోగ్యం కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు. ఏజెన్సీ ఏరియాలో మరికొన్ని సెల్ టవర్లు పెట్టించి కనెక్టివిటీ పెంచుతామన్నారు. గిరిజనుల ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామన్నారు. 3 నెలల్లో ఇక్కడ ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగుపరుస్తామని తెలిపారు. ఏ వైద్య పరీక్ష అయినా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిపేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తున్నామని.. దీంతో తాను సంతృప్తి చెందడం లేదనీ.. గిరిజన ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ గిరిజనులకే దక్కాలనేది ఈ ప్రభుత్వ విధానం అని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన జిఒ ను మళ్లీ తీసుకువస్తామని హామీ ఇస్తున్నానన్నారు. వీలైనంత త్వరగా అన్ని గ్రామాలకు రోడ్లు వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అరకు కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చామన్నారు. ఏజెన్సీ ప్రజలకు ఆదాయం అరకు కాఫీ, మిరియాల నుంచి వస్తోందని సిఎం వివరించారు.
గ్రామస్థులతో ముఖాముఖి ...
గన్నెల పంచాయతీ ఆర్.కె.నగర్‌లో ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన సిఎం చంద్రబాబు.. ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలు, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. గర్భిణీతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ గ్రామంలో 47 ఇళ్లు, 189 మంది జనాభా ఉండగా.. ఇక్కడ పాపులేషన్ మేనేజ్‌మెంట్ బాగుందని, అందుకు గల విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళ తన కుమార్తె నీట్ శిక్షణలో ఉందని తెలుపగా.. శెభాష్ అన్న ముఖ్యమంత్రి.. అందరూ ఇదే స్ఫూర్తితో పిల్లలని చదివించాలన్నారు. మహిళలతో మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారు ? అని ప్రశ్నించారు. ఆర్.కె.(రామకృష్ణ) నగర్ లో మొత్తం 16 మందితో మాట్లాడిన సిఎం... అందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని పథకాలు మీ వరకు చేరుతున్నాయా అని ఆరా తీశారు. చంద్రబాబు రాకను పురస్కరించుకొని ఆర్.కె.నగర్ మహిళలు, చిన్నారులు థింసా నృత్యంతో స్వాగతం పలికారు.








కామెంట్‌లు (0)