ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విపత్తు వేళ .. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్‌ !

1 గంట క్రితం

In a moment of crisis... a principal saved the lives of 1,643 students!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 03:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

నేపాల్‌లో ఆకస్మిక వరద.. క్షణాల్లో అప్రమత్తమైన రాజేంద్ర దవాది


నేపాల్ : నేపాల్‌లో ఆకస్మికంగా విరుచుకుపడిన వరదల నుంచి ఏకంగా 1,643 మంది విద్యార్థుల ప్రాణాలను ఓ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తన సమయస్ఫూర్తితో కాపాడారు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి, క్షణాల్లో నిర్ణయం తీసుకుని పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పెను విషాదం తప్పింది. లేదంటే స్కూల్‌ భవనంతో పాటు విద్యార్థులు, సిబ్బంది కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయేవారు.


నేపాల్‌లో గత బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. అనేక గ్రామాలు వరదల్లో కొట్టుకుపోగా, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు వేల మందికిపైగా గల్లంతైనట్లు సమాచారం. ఈ విపత్కర పరిస్థితుల్లో త్రిశూలి సెకండరీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రాజేంద్ర దవాది చూపిన చొరవ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. నేపాల్‌లోని త్రిశూలి వ్యాలీలో ఉన్న ఈ పాఠశాలలో 1,643 మంది విద్యార్థులు చదువుతున్నారు. మూడంతస్తుల భవనంలో నిర్వహిస్తున్న స్కూల్‌కు రాజేంద్ర దవాది ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండటంతో పాటు ఇంగ్లీష్‌ టీచర్‌గానూ వ్యవహరిస్తున్నారు. వరదలు సంభవించిన బుధవారం ఉదయం ఆయన పాఠశాలలోనే ఉన్నారు.


కొన్ని నిమిషాల్లోనే కీలక నిర్ణయం

ఉదయం 9.20 గంటల సమయంలో రాజేంద్రకు ఓ స్నేహితుడి నుంచి వరద ముప్పుపై హెచ్చరిక ఫోన్‌ వచ్చింది. అయితే స్కూల్‌ ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో పాటు భవనం కూడా పటిష్టంగా ఉండటంతో తొలుత పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చని ఆయన భావించారు. అయితే కొద్దిసేపటికే గ్రామానికి చెందిన మరో వ్యక్తి పాఠశాలకు వచ్చి పరిస్థితి తీవ్రంగా ఉందని హెచ్చరించాడు. చుట్టుపక్కల ప్రాంతాలను వరద నీరు చుట్టుముడుతోందని, నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోందని చెప్పాడు. దీంతో రాజేంద్ర వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలస్యం చేయకుండా స్కూల్‌ అలారం మోగించి, విద్యార్థులందరినీ తరగతి గదుల నుంచి బయటకు తీసుకురావాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అదే సమయంలో స్కూల్‌ బస్సు డ్రైవర్లను కూడా పిలిపించి, బస్సులను సిద్ధం చేయాలని సూచించారు.


బస్సులు రాలేకపోవడంతో కొండపైకి ..

అయితే అప్పటికే వరద ఉధృతి పెరగడంతో బస్సులు స్కూల్‌ వద్దకు చేరుకోలేకపోయాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న రాజేంద్ర మరో క్షణం కూడా ఆలస్యం చేయలేదు. విద్యార్థులందరినీ సమీపంలోని కొండపైకి వెళ్లాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కొండపైకి చేరుకుని అక్కడి బోధి చెట్టు కింద ఆశ్రయం పొందారు. వారు సురక్షిత ప్రాంతానికి చేరుకున్న కొద్దిసేపటికే స్కూల్‌ భవనం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.


ఇద్దరు సిబ్బంది మృతి ....

ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. స్కూల్‌ సోషల్‌ హిస్టరీ టీచర్‌ సంతోస్‌ పరియార్‌ (32) తో పాటు మరో సిబ్బంది సుల్తాన్‌ లామా వరదల్లో చిక్కుకుని మృతి చెందారు. ప్రిన్సిపాల్‌ రాజేంద్ర దవాది సకాలంలో స్పందించి విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించకపోయి ఉంటే పరిస్థితి మరింత విషాదకరంగా మారేదని స్థానికులు చెబుతున్నారు. ఒక్క నిర్ణయం.. కొన్ని నిమిషాల సమయస్ఫూర్తి.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడింది. ఈ ధైర్యసాహసానికి రాజేంద్ర దవాదిని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్