- పల్నాడు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు
ప్రజాశక్తి- యంత్రాంగం: మురసు, అర్నబ్ తుపాన్ల ప్రభావంతో దెబ్బతిన్న రవాణా, విద్యుత్, వ్యవసాయ, ఉద్యాన రంగాల నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేస్తామని కేంద్ర బృందాలు వెల్లడించాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా శనివారం పల్నాడులో ఓ బృందం, తూర్పుగోదావరి జిల్లాల్లో మరో బృందం పర్యటించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పరిధిలో మురసు తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, నష్టాలను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను పరిశీలించి నష్ట తీవ్రతను అడిగి కేంద్ర బృందం అడిగి తెలుసుకుంది. నష్టం అంచనాలపై రూపొందించిన నివేదికను కేంద్ర బృందం సభ్యులకు కలెక్టర్ అందజేశారు. బొప్పూడి గ్రామంలో దెబ్బతిన్న ఇళ్లు, వ్యవసాయ, ఉద్యాన పంటలను బృందం సభ్యులు పరిశీలించారు. బాతుల పెంపకందారులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర బృందం నాదెండ్ల మండలంలో గండ్లు పడిన చెరువులను, దెబ్బతిన్న వ్యవసాయ పంటలను పరిశీలించింది. ఎడ్లపాడు నుంచి జలది మీదుగా తుర్లపాడు వరకు దెబ్బతిన్న రహదారులను బృందం సభ్యులు పరిశీలించారు. అధికారులతో శాఖల వారీగా జరిగిన నష్టాలపై సమీక్ష చేశారు. బృందంలో సీనియర్ ఐఎఎస్ అధికారులు చిత్తరంజన్ దాస్, ప్రశాంత్ ఆర్మోరికర్, హిమాలయ గార్గ్, ప్రణయ్ గార్గ్ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయం, ఉద్యాన, జలవనరులు, రహదారులు – భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యుత్, గృహ నిర్మాణం, పశుసంవర్ధక, మత్స్యశాఖలకు సంబంధించిన నష్టం అంచనాలు, ఛాయాచిత్రాలు, ఇతర ఆధారాలను కేంద్ర బృందం పరిశీలించింది. మురసు తుపాను ప్రభావం జిల్లాలోని 22 మండలాలకు గాను 20 మండలాల్లో కనిపించిందని, 244 గ్రామాలు, రెండు పట్టణాలు ప్రభావితమయ్యాయని, 10,823 మంది జనాభాపై ప్రభావం పడిందని జిల్లా యంత్రాంగం వివరించింది. ప్రధానంగా వరి, మినుము పంటలకు నష్టం వాటిల్లిందని, వ్యవసాయ రంగానికి రూ.163.27 కోట్లు, వివిధ శాఖల నుంచి అందిన నివేదికల ప్రకారం మొత్తం రూ.336.33 కోట్ల మేర నష్టం సంభవించినట్లు వెల్లడించింది. అర్నబ్ తుపాను వల్ల 1,29,900 ఎకరాల్లో పంట నష్టం సంభవించగా, సుమారు 3.84 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. మురసు, అర్నబ్ తుపానుల కారణంగా కలిపి వ్యవసాయ రంగానికి సుమారు రూ.1,109.10 కోట్ల మేర నష్టం అంచనా వేసినట్లు కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర బృందంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్, ఇస్రో శాస్ర్తవేత్త డాక్టర్ ఎస్.వి.ఎస్.పి. శర్మ, కేంద్ర జల సంఘం సూపరింటెండింగ్ ఇంజనీర్ రాఖా రాణి కొల్లు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శశాంక్ శేఖర్ రాజ్ ఉన్నారు.








కామెంట్లు (0)