- విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మరోవైపు కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి అనంతపురం జిల్లా సిద్దరాంపురంలో అత్యధికంగా 61 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.









కామెంట్‌లు (0)