శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హాస్టళ్లలో జాగ్రత!

1 రోజు క్రితం

హాస్టళ్లలో జాగ్రత! 
- వర్షాల నేపథ్యంలో మంత్రి సవిత హెచ్చరిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వర్షాల నేపథ్యంలో మంత్రి సవిత హెచ్చరిక

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బిసి వసతి గృహాలు, గురుకులాల విద్యార్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా, వసతి గృహాలు, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, పలువురు బిసి కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి సవిత గురువారం సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా బిసి సంక్షేమ శాఖ కార్యదర్శికి మంత్రి సవిత కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో బిసి సంక్షేమ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. హాస్టళ్లు, గురుకులాల సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ, విద్యార్థుల యోగా క్షేమాలను గమనిస్తూ ఉండాలన్నారు. వేడి, తాజా ఆహారం మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. బయట ఆహారాన్ని లోపలికి అనుమతించవద్దని, కాచి చల్లార్చిన నీటి మాత్రమే అందివ్వాలని సూచించారు. వసతి గృహాలు, గురుకులాల చుట్టు పక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, వ్యాధులు ప్రబలక ముందే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించాలన్నారు. పాత భవనాల్లో ఉన్న విద్యార్థులను సురక్షిత భవనాల్లోకి తరలించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని బిసి కార్పొరేషన్ చైర్మన్లకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. కూటమిలోని పార్టీలు, నాయకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టంచేశారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపి ఈశ్వర్, మల్లెల ఈశ్వర్, వెంకటరమణ,యాటగిరి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్