ప్రజాశక్తి–అమరావతి బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా నిర్వహణ, ఎన్నికల సంఘం పనితీరుపై వస్తోన్న అభ్యంతరాల నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె శ్రీదేవి, వి సావిత్రి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామిక హక్కు అని, ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపు, చేర్పులు, డేటా నిర్వహణ తదితర అంశాల్లో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని తెలిపారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ఆరోపణలు, అభ్యంతరాలపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొన్నారు. సిఇసికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు చేపడుతున్న నిరసనలకు ఐద్వా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28న నిర్వహించే ‘యూత్ ఫర్ డెమోక్రసీ’ కార్యక్రమాల్లో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అక్టోబరు 2న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు.
ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల సంఘం జవాబుదారీతనం కోసం ప్రజాస్వామ్యవాదులు, మహిళలు, యువత, పౌరసమాజ సంస్థలు ఉద్యమించాలని కోరారు.







కామెంట్‌లు (0)