శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం

45 నిమిషాల క్రితం

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం 
- కొత్త బ్యారేజీల ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలి
- భారీ వర్షాలు, వరదలపై సిఎం చంద్రబాబు సమీక్ష image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 10:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కొత్త బ్యారేజీల ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలి

- భారీ వర్షాలు, వరదలపై సిఎం చంద్రబాబు సమీక్ష

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల చొప్పున బియ్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ​రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో నదులు, రిజర్వాయర్లలో పెరిగిన ప్రవాహాలు, ముంపు పరిస్థితులపై సిఎం శనివారం నాడు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటలు ముంపునకు గురైన పరిస్థితి, తీసుకుంటున్న సహాయక, పునరావాస చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయాన్ని అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సిఎం సూచించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎగువనున్న రాష్ట్రాల నుంచి ప్రస్తుతం పెద్దగా ప్రవాహాలు లేవని, స్థానికంగా వస్తున్న వరద నీటి కారణంగానే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం పెరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్థానికంగా వచ్చే వరద నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు సూచించారు. పులిచింతల - ప్రకాశం బ్యారేజీ మధ్యన ఓ కొత్త బ్యారేజీ నిర్మాణం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఇంకో బ్యారేజీ నిర్మించాల్సిన అవసరాన్ని గతంలోనే ఆలోచన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. హిరమండలం లిఫ్ట్‌ ప్రాజెక్టుకు విద్యుత్‌ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వివిధ జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కోస్తాంధ్రలో ప్రస్తుతం 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగించాలని సిఎం ఆదేశించారు.

రిజర్వాయర్లల్లో నీటి మట్టాలు.. బేసిన్ల వారి ప్రవాహాలపై సిఎం ఆరా

​రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లలో నీటి మట్టాలు, వివిధ నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రవాహాల వివరాలను అధికారులను సిఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 29 రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగాయని అధికారులు వివరించారు. ఈ నెల 23న ఆయా రిజర్వాయర్లలో నీటి మట్టాలు 101 టిఎంసిలు ఉండగా... 26 నాటికి 21 టిఎంసిలు మేర నీటి మట్టాలు పెరిగాయన్నారు. ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టుల పరిధిలో సుమారు 5 టిఎంసిల మేర నీటి మట్టాలు పెరిగాయని తెలిపారు. పలు జిల్లాల్లోని 18 రిజర్వాయర్ల పరిధిలో సుమారు 16 టిఎంసిల మేర నీటి మట్టాలు పెరిగాయని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో నదుల ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు.. సిఎం దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగం ఉండాలని, నీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సిఎం దిశా నిర్దేశం చేశారు. ఈ టెలీకాన్ఫరెన్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్