- పోలవరం జిల్లాలో ‘స్కూల్ బచావో’ కార్యక్రమం
ప్రజాశక్తి - చింతూరు (పోలవరం జిల్లా) : పోలవరం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో సమస్యలను తెలుసుకుంటూ ఎస్ఎఫ్ఐ ‘స్కూల్ బచావో’ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా మూడో రోజైన మంగళవారం చింతూరు, కూనవరం మండలాల్లో నాయకులు పర్యటించారు. చింతూరులోని డిగ్రీ కాలేజీని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ డిగ్రీ కాలేజీకి ఇప్పటికే నిర్మాణం చేసిన నూతన భవనం గదులను కాలేజీకి అప్పగించాలని, మరో భవనం నిర్మాణానికి రూ.ఐదు కోట్ల నిధులు కేటాయించారని, వాటితో త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పొలిటికల్ సైన్స్కు అధ్యాపకులను నియమించాలని కోరారు. నూతన భవనం దగ్గర అమ్మాయిలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, క్లాసులు ప్రారంభించాలని, మంచినీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. బాలుర హాస్టల్ పాత భవనం అవడంతో వర్షానికి కారుతోందని, ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో విద్యార్థులు బిక్కుబిక్కుమని ఉంటున్నారని తెలిపారు. తక్షణమే హాస్టల్ భవనాలు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయిల హాస్టల్లో తాగునీరు, వాడుక నీరు సమస్యలు ఉన్నాయని, వంట గది లేదని తెలిపారు. కూనవరం మండలంలోని కోతులగుట్ట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, గురుకుల పాఠశాలలను కూడా ఎస్ఎఫ్ఐ బృందం సందర్శించింది. ఆయా చోట్ల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. పాఠశాలలో తరగతులు నిర్వహించేందుకు సరిపడా గదులు లేకపోవడంతో డార్మిటరీలోనే తరగతులు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు డైనింగ్ హాల్ సౌకర్యం కూడా లేదని వివరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు లోవరాజు, నాయకులు వై.భాస్కర్, క్రాంతి, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు లక్ష్మణ్, సుబ్బారావు పాల్గొన్నారు.








కామెంట్లు (0)