- ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానోత్సవంలో గజల్ శ్రీనివాస్
ప్రజాశక్తి - గుంటూరు: ఎఐ, ఆన్లైన్ విద్య వంటి ఎన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా నిజ జీవితంలో గురువుకు సాటి రావని, ఉపాధ్యాయుడికి ఎఐ ప్రత్యామ్నాయం కాదని ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ అన్నారు. కెవిఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 44 మంది ఉపాధ్యాయులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజల్ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు సామాజిక విలువలు, క్రమశిక్షణ, లక్ష్య నిర్దేశం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమని, ప్రస్తుత సమాజంలో ఇవి ఎంతో అవసరమని, కానీ ఎఐ ఆ స్థానాన్ని భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ పాటలు పాడి ఉత్తేజపరిచారు. ట్రస్టు అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రోత్సహించటానికి, విద్యారంగంలో వస్తున్న మార్పులపై అవగాహనకు ట్రస్ట్ వివిధ కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. జనచైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో, అక్షరాస్యత, సారా వ్యతిరేకత, సైన్స్ వంటి ఉద్యమాల్లో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించారని తెలిపారు. కార్యక్రమంలో భారతీయ విద్యా భవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు, ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ ప్రతినిధి మేఘనారెడ్డి, యుటిఎఫ్ రాష్ర్ట ప్రచురణాల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్ ట్రస్టు ఉపాధ్యక్షురాలు కె.విజయ కుమారి, వంగిపురపు శారదాదేవి, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)