- నీతి ఆయోగ్ సిఇఒకు ఇఎఎస్.శర్మ లేఖ
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :
దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి జాతీయ స్థాయిలో సమగ్ర విధానాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్.శర్మ నీతి ఆయోగ్ సిఇఒ అనురాగ్ జైన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు శుక్రవారం లేఖ రాశారు. అనంతరం ఆ విషయాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుపై నీతి ఆయోగ్ విడుదల చేసిన మూల్యాంకన ముసాయిదాకు సంబంధించి శర్మ పలు సూచనలు చేశారు. డేటా సార్వభౌమాధికారం, పర్యావరణ పరిరక్షణ, నీటి వినియోగం, విద్యుత్ అవసరాలు, ప్రభుత్వ రాయితీలపై సమగ్ర పరిశీలన జరగాలని పేర్కొన్నారు. విదేశీ సంస్థల ఆధ్వర్యంలోని డేటా సెంటర్ల వల్ల దేశ డేటా సార్వభౌమాధికారానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 7.9 గిగావాట్లు, తెలంగాణలో 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన 7.9 గిగావాట్ల డేటా సెంటర్లకు ఏటా 4.4 టిఎంసిల నీరు అవసరమవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఈ పరిమాణం సుమారు 17 లక్షల మంది తాగునీటి అవసరాలకు లేదా 44 వేల ఎకరాల సాగునీటికి సమానమని వివరించారు. భారీ డేటా సెంటర్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవసరమని, దీనివల్ల విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌కు 2047 వరకు కేంద్ర ప్రభుత్వం కల్పించే పన్ను రాయితీల విలువ సుమారు రూ.95 వేల కోట్లు ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే రాయితీలు, సబ్సిడీలు మరో రూ.22 వేల కోట్ల మేర ఉంటాయని అంచనా వేశారు. ఇంత భారీగా ప్రజాధనం వెచ్చిస్తున్నప్పటికీ ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ద్వారా సుమారు 300 నుంచి 400 మందికే ఉపాధి లభిస్తుందని శర్మ పేర్కొన్నారు. ఈ నిధులను పాఠశాలలు, ఆసుపత్రులు, సాగునీటి ప్రాజెక్టుల వంటి ప్రజోపయోగ రంగాలకు వెచ్చిస్తే మరింత విస్తృత ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్లకు ప్రత్యామ్నాయంగా ఎడ్జ్ కంప్యూటింగ్ విధానాన్ని, 20 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం కలిగిన చిన్న డేటా సెంటర్ల ఏర్పాటును పరిశీలించాలని శర్మ కోరారు.








కామెంట్‌లు (0)