- చేనేత, పవర్లూమ్, హస్తకళల యూనిట్ల గుర్తింపునకు చర్యలు
- సిఎస్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సమగ్ర వస్త్ర గణన (ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ సెన్సస్) 2026–27 నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్రస్థాయి అపెక్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర వస్త్ర మంత్రిత్వశాఖ చేపడుతున్న దేశవ్యాప్త గణనలో భాగంగా రాష్ట్రంలో కూడా ప్రణాళిక, సమన్వయం, పర్యవేక్షణ, సమాచార నాణ్యతను నిర్ధారించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (చేనేత, జౌళి), చేనేత, జౌళిశాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (ఎపిహెచ్డిసి) వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జోనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అధికారి లేదా ప్రాంతీయ ఉపసంచాలకుడు, ఆర్థిక గణాంకాల సంచాలకుడు, కేంద్ర వస్త్ర మంత్రిత్వశాఖ ప్రాంతీయ లేదా క్షేత్రస్థాయి కార్యాలయ ప్రతినిధి కమిటీలో సభ్యులుగా ఉంటారు.
కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సమగ్ర వస్త్ర గణన చేపడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హత కలిగిన చేనేత, పవర్లూమ్, హస్తకళల యూనిట్లన్నింటినీ ఈ గణన పరిధిలోకి తీసుకురానున్నారు. గృహాల ఆధారంగా పనిచేసే యూనిట్లతో పాటు సంస్థల ఆధారంగా నిర్వహించే యూనిట్లను కూడా నమోదు చేయనున్నారు. రిజిస్టర్ అయినవి, నమోదు కానివి అనే తేడా లేకుండా అర్హత కలిగిన యూనిట్లను గుర్తించడంతో పాటు వస్త్ర రంగం విలువ ఆధారిత సరఫరా శ్రేణిలోని ఇతర విభాగాలనూ గణనలో చేర్చనున్నారు. ఈ గణనకు సంబంధించిన క్షేత్రస్థాయి వివరాల సేకరణను ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాలు నిర్వహిస్తాయి. ఇందుకోసం కేంద్ర వస్త్ర మంత్రిత్వశాఖ నిర్దేశించిన ఉమ్మడి విధానం, కార్యాచరణ మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి మాన్యువళ్లు, సాంకేతిక ప్రమాణాలను అనుసరించాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి అపెక్స్ కమిటీకి అవసరమైన సమాచారం అందించడం, పరిపాలనా సహకారం, నివేదికల సమర్పణ తదితర బాధ్యతలను చేనేత, జౌళిశాఖకు అప్పగించారు.
జిల్లా స్థాయిలో ప్రత్యేక యంత్రాంగం
జిల్లా నోడల్ అధికారుల నియామకం, జిల్లా స్థాయిలో తగిన అమలు వ్యవస్థల ఏర్పాటు కోసం జిల్లా పరిపాలనా యంత్రాంగాలతో కమిటీ సమన్వయం చేయనుంది. పాల్గొనే జిల్లాల కలెక్టర్లు లేదా జిల్లా మెజిస్ట్రేట్లు కమిటీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. అవసరాన్ని బట్టి పరిశ్రమల సంఘాలు, చేనేత కార్మికులు, నేతన్నలు, చేతివృత్తిదారుల సంఘాలు, ఇతర సంస్థల ప్రతినిధులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చుకోవచ్చు. గణనకు సంబంధించిన చర్చల్లో సహకారం పొందేందుకు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు లేదా సంబంధిత రంగ నిపుణులను సభ్యులుగా సహ-నియమించుకునే అధికారం కూడా కమిటీకి కల్పించారు.








కామెంట్లు (0)