ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి అంతంతమాత్రమే..!

12 నవంబర్, 2026

MAHIA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 06:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- చివరి స్థానంలో సిఎం సొంత జిల్లా చిత్తూరు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని, స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న ఫలితాలకు మధ్య పొంతన లేకుండా ఉంది. మహిళా లబ్ధిదారుల ఎంపిక, రుణాలు మంజూరు చేయడం వరకు సాగుతున్న ప్రక్రియ.. పరిశ్రమల స్థాపనలో మాత్రం వెనుకబడినట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) వెబ్‌ ‌సైట్‌‌లో పేర్కొన్న వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 5,01,669 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా గుర్తించగా, వీరి కోసం సుమారుగా రూ.7,500 కోట్ల పెట్టుబడి లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఇప్పటి వరకూ 3,05,356 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. సెర్ఫ్‌

గణాంకాల ప్రకారం వీరిలో కేవలం 1,50,517 మందికి మాత్రమే పరిశ్రమలు, వ్యాపారాలను ప్రారంభించారు. అంటే రుణాలు పొందిన వారిలో 49.29 శాతం మంది మాత్రమే వ్యాపారాలు ప్రారంభించారు. మిగిలిన 1,54,837 మంది ఇంకా వారి పరిశ్రమలు, వ్యాపారాలను ప్రారంభించాల్సి ఉంది.

జిల్లాల్లోనూ అసమాన పురోగతి

జిల్లాల వారీ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితిలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు ‌జిల్లా 67 శాతంతో అగ్రస్థానం ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో 27 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో కేవలం 13 జిల్లాల్లోనే రాష్ట్ర సగటు 49.29 శాతానికి మించి పురోగతి నమోదైంది. 15 జిల్లాలు రాష్ట్ర సగటు కంటే వెనుకబడ్డాయి. చిత్తూరు జిల్లాలో రుణాలు మంజూరైన వారిలో నాలుగో వంతు మందికి మాత్రమే వ్యాపారాలు ప్రారంభించినట్లు వెల్లడయ్యింది. శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ పురోగతి 36 శాతం లోపే ఉంది. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి అంటూ ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ, గుర్తించిన ప్రతి మహిళకు రుణ సదుపాయం కల్పించడం, మంజూరైన రుణాలతో వ్యాపారాలు ప్రారంభించేలా చేయడం, అవసరమైన యంత్రాలు, పరికరాలు, ఇతర ఆస్తులను సమకూర్చడం వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. రుణాలు మంజూరైనప్పటికీ పరిశ్రమలు, వ్యాపారాల ప్రారంభించడానికి కారణాల విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్