విజయవాడలో వెలసిన వినూత్న పోస్టర్లు
- క్యూఆర్ కోడ్, ఏఐ ఆడియోలతో ప్రజాస్వామ్య పాలనపై వ్యంగ్యాస్త్రాలు
- నిధుల సేకరణపై ఆరా, సిసి పుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి :
రాజకీయ అధికారం చేతులు మారినా, పాలకుల ముఖాలు మారినా సామాన్యుడి బతుకు చిత్రం మాత్రం మారడం లేదనే ఆవేదనతో కూడిన వ్యంగ్య పోస్టర్లు విజయవాడ నగరంలో తీవ్ర చర్చకు దారితీశాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు, గాంధీనగర్ వంటి రద్దీ ప్రాంతాల్లోని గోడలపై ‘పాలకుడి ముఖం మారితే అధికార స్వభావం మారుతుందా?’ అనే ప్రశ్నతో కూడిన పోస్టర్లు వెలిశాయి. మనిషి శరీరానికి పంది ముఖం మాస్క్ ఉన్న చిత్రంతో ముద్రించిన ఈ పోస్టర్లు ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తీరును సూటిగా ప్రశ్నించేలా ఉన్నాయని నగరవాసులు చర్చించుకుంటున్నారు.
క్యూఆర్ కోడ్, ఏఐ ఆడియోలతో వినూత్న ప్రచారం
ఈ పోస్టర్లపై ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతోపాటు ఒక క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీనిని స్కాన్ చేస్తే ఇదే పేరుతో ఉన్న ఎక్స్ (ఎక్ష్/ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తెరుచుకుంటున్నాయి. ‘పోరాడు, సంఘటితమవ్వు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ అనే నినాదంతో ఉన్న ఈ ఎక్స్ ఖాతా కేవలం నటుడు ప్రకాశ్ రాజ్‌ను మాత్రమే ఫాలో అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సామాజిక మాధ్యమ ఖాతాల్లో కృత్రిమ మేధ (ఎఐ) సాంకేతికత సాయంతో రాజకీయ నాయకుల ప్రసంగ శైలిని అనుకరిస్తూ రూపొందించిన వ్యంగ్య ఆడియోల ద్వారా పాలకుల తీరును ఎండగడుతున్నారు.
నిధుల సేకరణ, రాజకీయ ఊహాగానాలు...
విజయవాడతోపాటు హైదరాబాద్ నగరంలోనూ ఇదే తరహా పోస్టర్లు దర్శనమివ్వడంతో దీని వెనుక ఉన్న అదృశ్య శక్తులపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చర్చకు వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తరహాలో ఇది ఏదైనా వినూత్న నిరసన ప్రచారమా లేక ప్రముఖ నటులు, మాజీ ఎంపి, మాజీ ఐఏఎస్ అధికారుల ప్రమేయంతో రాబోతున్న కొత్త రాజకీయ వేదిక ప్రచారమా లేక సినిమా ప్రమోషనా అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి.
అధికార యంత్రాంగం అప్రమత్తం
మరోవైపు, క్యూఆర్ కోడ్ ద్వారా నిధుల సేకరణ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పాటు, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాత్రి వేళల్లో ఈ పోస్టర్లను అంటించిన గుర్తుతెలియని వ్యక్తులను, సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లోని సిసి కెమెరాల ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయితే తప్ప దీని వెనుక ఎవరున్నారనేది తెలస్తుంది.
తెలంగాణలోనూ ‘సైలెంట్ పార్టీ’ కలకలం
విజయవాడ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ వినూత్న ప్రచారం విస్తరించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గోడలపై ఇదే తరహా పంది ముఖం పోస్టర్లు వెలవగా, కామారెడ్డి జిల్లా కేంద్రంలో దినపత్రికల మధ్యలో కరపత్రాల రూపంలో ఈ ప్రచారం రావడం స్థానికంగా కలకలం రేపింది.









కామెంట్‌లు (0)