సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కళ్లేదుటే చెట్లన్నీ ఎండిపోతున్నాయ్‌..!

4 రోజుల క్రితం

కళ్లేదుటే చెట్లన్నీ ఎండిపోతున్నాయ్‌..!
- సిపిఎం బృందం ఎదుట రైతుల ఆవేదన
ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పర్యటన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం బృందం ఎదుట రైతుల ఆవేదన

- ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పర్యటన

ప్రజాశక్తి- యంత్రాంగం : ‘భూగర్భ జలాలు అడుగంటి చీనీ, అరటి, దానిమ్మ చెట్లన్నీ కళ్లెదుటే ఎండిపోతున్నాయి. ట్యాంకర్ల ద్వారా వేలాది రూపాయలు ఖర్చు చేసి చెట్లకు నీటి తడులను అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కరువు తమను పూర్తిగా దెబ్బతీసింది’ అంటూ సిపిఎం నాయకుల ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం అనంతపురం జిల్లా పుట్లూరు, రాప్తాడు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో సిపిఎం రాష్ర్ట కరువు బృందం బుధవారం పర్యటించింది. అనంతపురం జిల్లా పుట్లూరు, బాలాపురం, హంపాపురం గ్రామాల్లో చీనీ, అరటి తోటలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, అనంతపురం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, సత్యసాయి జిల్లా కార్యదర్శి రామకృష్ణ తదితరులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. పుట్లూరుకు చెందిన రైతు నారాయణరెడ్డి మాట్లాడుతూ... ‘తనకున్న 4.25 ఎకరాల్లో ఎనిమిది సంవత్సరాలు వయస్సున్న 400 చీనీ చెట్లను కాపాడుకునేందుకు 12 బోర్లు వేశాను. కరువు నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ ఎండిపోయాయి. కేవలం రెండు బోర్లలో రెండు ఇంచులు మాత్రమే నీరొస్తోంది. చీనీ చెట్లు ఆరు సంవత్సరాలు పెంచడానికి దాదాపు రూ.ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టాను. కాయలుకాసే దశకు వచ్చిన తర్వాత వర్షాభావం వల్ల బోర్లలో నీళ్లు రాక ఇప్పటికీ 150 చెట్లు ఎండిపోయాయి. చెట్లన్నీ ఎండిపోవడంతో రూ.4.50లక్షలు నష్టం వచ్చింది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాలాపురం గ్రామానికి చెందిన రైతు పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ... తాను ఎనిమిది ఎకరాల్లో అరటి, 13 ఎకరాల్లో చీనీ, 14 ఎకరాల్లో దానిమ్మ చెట్లు నాటానాని, బోర్లన్నీ ఎండిపోవడంతో చెట్లు కూడా ఎండిపోతున్నాయని తెలిపారు. రెండు నెలల నుంచి రోజుకు వేలాది రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం రాంభూపాల్‌, దడాల సుబ్బారావు మాట్లాడుతూ... అనంతపురం జిల్లాలో ఏ గ్రామంలో చూసినా నీళ్లు లేక ఉద్యానవన తోటలన్నీ ఎండిపోయాయని, నష్టపోయిన ప్రతి మెట్ట పంటకు ఎకరాకు రూ.50 వేలు, ఉద్యాన పంటలకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కౌలు రైతులకూ పంట నష్టపరిహారం అందించాలని కోరారు.

వ్యవసాయ కార్మిక కుటుంబాలకు 50 కిలోల బియ్యం, రూ.10 వేల సాయం : రమాదేవి డిమాండ్‌

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మండలం మంగమూరు, పంగులూరు మండలంలోని కోటపాడు, మార్టూరు మండలంలోని కొలలపాడు గ్రామాల్లో సిపిఎం బృందం కరువు పరిస్థితులపై రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులను అడిగి తెలుసుకుంది. మార్టూరు మండలం నాగరాజుపల్లి తండాకు చెందిన గిరిజన రైతులు తమ సమస్యలను బృందం దృష్టికి తీసుకొచ్చారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న 89 ఎకరాల పంట భూములను ఎంఎస్‌ఎంఇ పార్కు పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ... అనేక ప్రాంతాల్లో సాగుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతోపాటు బోర్లు, బావుల కింద సాగు చేసిన కంది, పత్తి, మిర్చి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి 50 కిలోల బియ్యం, రూ.పది వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులు తొలగే వరకు ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టాలని కోరారు. ఇటీవల పట్టణాలుగా మారిన గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్