- మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి
- ఆస్పత్రి ఎదుట వైసిపి నేతల నిరసన
ప్రజాశక్తి - కర్నూలు క్రైమ్/కలెక్టరేట్ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో 26న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ వైసిపి నాయకులు అభ్యంతరం తెలపడంతో చోటు చేసుకున్న ఘర్షణలో ఎమ్మెల్యే కాన్వాయ్ ఢీకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగలక్ష్మి (50) శనివారం కర్నూలులో మృతి చెందారు. ఈ దాడిలో గాయపడ్డ నలుగురిలో ఇద్దరు నంద్యాలలో, ఒకరు కడపలో చికిత్సపొందుతున్నారు. మరొకరు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. నాగలక్ష్మి మృతికి కారణమైన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరంలోని అమృత ఆస్పత్రి ఎదుట నంద్యాల జిల్లా వైసిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు జిల్లా వైసిపి అధ్యక్షులు ఎస్‌వి.మోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి నాయకులు పట్టుబట్టడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పోలీసులు తరలించారు. ఈ ఘటనపై కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో, ఆళ్లగడ్డ రూరల్ ఎస్‌ఐకి వైసిపి నాయకులు ఫిర్యాదు చేశారు.
అనారోగ్యంతోనే మృతి : ఆళ్లగడ్డ డిఎస్‌పి
నాగలక్ష్మి మృతికి అహోబిలం ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, అనారోగ్య కారణాలతోనే ఆమె మృతి చెందారని ఆళ్లగడ్డ డిఎస్‌పి రవికుమార్ వెల్లడించారు. మరోవైపు, ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలోనే నాగలక్ష్మి అస్వస్థతకు గురైందని, చికిత్స పొందుతూ మృతి చెందారని ఆమె బంధువులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.








కామెంట్‌లు (0)