శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన కార్మికులు

1 గంట క్రితం

rayadurgam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 02:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాయదుర్గం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాయదుర్గం పట్టణంలో శనివారం మున్సిపల్ కార్మికులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్, పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో రాయదుర్గం గాంధీ విగ్రహానికి డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు మున్సిపల్, గ్రామ పంచాయతీ, వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌ కార్మికులు, స్కీం వర్కర్స్ లక్షలాది మందికి ప్రభుత్వాలు జీతాలు పెంపుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఫలితంగా చిరుద్యోగులు, కార్మికుల కుటుంబాలు పస్తులతో కాలం గడుపుతున్నాయన్నారు. పి ఆర్ సి గడువు ముగిసి మూడేళ్ళు గడిచినా,నేటికీ 12 వ పి ఆర్ సి కమీషన్ ను ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కాలంలో నిత్యం పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, ఇంటి కిరాయిలు, పిల్లల విద్యా ఫీజులు, మందుల ధరలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు రూపాయి విలువ రోజురోజుకీ మరింత దిగజారి పోతోంది. అయినా జీతాల్లో పెంపుదల లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 80 వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న ఈ రోజునైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటిస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, స్కీంవర్కర్స్ ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అలాగే 12వ పి ఆర్ సి కమీషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నుండి ప్రకటన విడుదల చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.


దేశ 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తమ గోడును జాతిపిత మహాత్మా గాంధీకి విన్నవించుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ రంగంలో పౌర సేవల ప్రైవేటీకరణ ఉపసంహరించాలి. హైకోర్టు అదేశాల మేరకు మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి. 12 వ పిఆర్సి కమీషన్ను వెంటనే ఏర్పాటుచేయాలి. మధ్యంతరభృతి వెంటనే ప్రకటించాలి. గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ళకు పెంపు, ఎక్స్‌గ్రేషియా ₹ 5 లక్షల నుండి 7 లక్షలకు పెంపు, హెల్త్ కార్డులు మొదలైన వాటికి జీ ఓలు జారీ, మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులకు హెచ్ ఆర్ పాలసీ అమలు, వీరి శ్రమను గుర్తిస్తూ అన్ని రకాల షరతులు మినహాయించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.1972 గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి. పర్మినెంట్ సిబ్బందికి సరండర్ లీవ్ లు, డిఎ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆప్కాస్లోని ఒప్పంద కార్మికులు రిటైర్మెంట్, దీర్ఘకాలిక అనారోగ్యం లేదా మరణించిన వారి స్థానంలో వారి పిల్లలకు ఉ ద్యోగాలు ఇవ్వాలి. అర్హులైన మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి రాము, కోశాధికారి తిప్పరుద్ర మరియు కార్మికులు వన్నూరమ్మ, మహేష్, తిప్పేస్వామి, కొల్లారి, సహిరాభీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్