• 14 రోజుల రిమాండ్
• కర్నూలు సబ్ జైలుకు
• మరో 15 మంది కూడా
• వైసిపి అధినేత జగన్ ఖండన
ప్రజాశక్తి- ఆలూరు/చిప్పగిరి / అమరావతి బ్యూరో : కర్నూలు జిల్లా ఆలూరు వైసిపి ఎమ్మెల్యే బుసినె విరుపాక్షిని, ఆయన అనుచరులు 15 మందిని పోలీసులు ఆదివారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం, ఎస్సి, ఎస్టి అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. మరో 18 మంది వైసిపి కార్యకర్తలపైనా ఇవే సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అరెస్టు చేసిన 16 మందిని ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పర్చగా 14 రోజులు రిమాండు విధించడంతో కర్నూలు సబ్ జైలుకు తరలించారు. స్థానికుల కథనం ప్రకారం... నేమకల్లు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు శనివారం రాత్రి సంఘాల గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త గిరిపై దాడి చేశారనే సమాచారంతో ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన సోదరుడు శ్రీరాములు, కుమారుడు చంద్రశేఖర్, మరి కొంతమంది వైసిపి కార్యకర్తలు సంఘాల గ్రామానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం నేమకల్లు గ్రామంలోని టిడిపి నాయకుల ఇళ్లకు వారు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఇరుగ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములుకు చేయి విరిగింది. దీనిపై ఎమ్మెల్యే ఫిర్యాదును చిప్పగిరి పోలీసులు స్వీకరించలేదు. అయితే, టిడిపి నాయకుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపైనా,ఆయన అనుచరులపైనా పై సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అరెస్టును నిరసిస్తూ వైసిపి శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం : జగన్
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అర్ధరాత్రి పోలీసులు చేపట్టిన చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వైసిపి అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎమ్మెల్యే నివాసంలోని సిసిటివి హార్డ్‌డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. ఈ చర్యల ద్వారా ఆధారాలను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు, గుంటూరులో మాజీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫాపై నమోదైన కేసులను కూడా ప్రస్తావిస్తూ, ఇవన్నీ రాజకీయ కక్షసాధింపు చర్యలేనని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన వారిపై ఒక విధంగా, ప్రతిపక్ష నాయకులపై మరో విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతేడాది నిర్వహించిన డిఎస్‌సిపై సిబిఐ విచారణ జరపాలని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేను విడుదల చేయాలి
ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, విరూపాక్షి, వైసిపి నేత గిరి ఇంటిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నాయకుడు నాగరాజుతో పాటు సంబంధిత నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని వైసిపి లీగల్ సెల్ అధ్యక్షులు మలసాని మనోహర్ రెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టిడిపి నాయకులకు ఒక చట్టం, వైసిపి నాయకులకు మరో చట్టం అమలవుతోందని ఆరోపించారు.








కామెంట్‌లు (0)