- నకిలీ ఏఐ చిత్రాన్ని వ్యాప్తి చేసిన కేసులో ఇద్దరి అరెస్టు
హిసార్: సోషల్ మీడియాలో పోలీస్ అధికారి, మహిళా క్లీనర్‌కు సంబంధించిన నకిలీ ఏఐ చిత్రాన్ని నిజమైన సంఘటనగా ప్రచారం చేసిన కేసులో హర్యానాలోని హిసార్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు ఏఐ చాట్‌బాట్, మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి హింసాత్మక ఘటనను చిత్రీకరిస్తున్నట్లుగా కనిపించే నకిలీ చిత్రాన్ని రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ చిత్రాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి, వాస్తవ ఘటనగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
చిత్రాన్ని ఎలా రూపొందించారు, ఎవరి సూచనలతో తయారు చేశారు, ఏయే సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేశారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను పరిశీలిస్తూ కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.
ధృవీకరించని ఫొటోలు, వీడియోలు, ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను పరిశీలించకుండా సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలకు, మీడియాకు సూచించారు. నకిలీ ఏఐ కంటెంట్‌ను నిజమైన ఘటనగా చిత్రీకరించి ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)