ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వరద నీటిలోని చేపలు వాడొద్దని హెచ్చరిక.. కారణం ఇదే

03 సెప్టెంబర్, 2026

bihar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాట్నా: నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో బీహార్‌లోకి చేరిన వరద నీటిలో లభించే చేపలను పట్టడం, తినడం, కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పాడి, మత్స్య, పశు వనరుల శాఖ ఈ సూచనలు జారీ చేసింది. వరద నీటితో కొట్టుకొచ్చే చేపల మూలం, అవి తినేందుకు అనువైనవేనా అనే విషయం స్పష్టంగా తెలియకపోవడంతో వాటిని వినియోగించడం ప్రమాదకరమని అధికారులు తెలిపారు. గండక్ నది ద్వారా బీహార్‌లోకి ప్రవహించే వరద నీటితో వివిధ రకాల చేపలు చేరుతున్నాయి. వాటిలో కొన్ని మాంసాహార చేపలు కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వరద నీటిలోని చేపలు మురుగునీరు, చనిపోయిన జంతువుల అవశేషాలు వంటి కలుషిత పదార్థాలను తిని ఉండే అవకాశం ఉంది. దీంతో వాటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వంటి వ్యాధికారకాలు ఉండే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి చేపలను తినడం వల్ల ఆహార సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వరద నీటిలో దొరికే చేపలు త్వరగా పాడయ్యే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా చనిపోయిన చేపలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దని సూచించారు. ఇలాంటి చేపలను తిన్న తర్వాత కొందరిలో వాంతులు, తీవ్రమైన విరేచనాలు, కడుపునొప్పి, తలతిరగడం, ఆయాసం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని తెలిపారు. చేపలు తిన్న తర్వాత ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు సూచించారు. వరద నీరు పూర్తిగా తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపలు పట్టడం, వాటిని విక్రయించడం లేదా వినియోగించడం చేయవద్దని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్