బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పోరాటంతో పాలకులకు యువత హెచ్చరిక

2 రోజుల క్రితం

kavi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్‌ : నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ, ప్రభుత్వ తీరుపై పోరాటంతో పాలకులకు ఇటీవల యువత హెచ్చరిక పంపారని పలువురు వక్తలు అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన యువత, విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం సాగించిన హింసాకాండను ఖండిస్తూ, ఉత్తేజపూరితంగా పోరాడి విజయాన్ని సాధించిన యువతను అభినందిస్తూ పలువురు కవులు ఆదివారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కవితలు చదివి వినిపించారు. అరసం, సాహితీ స్రవంతి, విశాఖ రచయితల సంఘం, సహృదయ సాహితి, అమరావతి విశ్వసాహితి పాల్గొన్నాయి. ‘బొద్దింకల కవనభేరి’ (కవితా గోష్టి) పేరిట ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ కెఎస్.చలం మాట్లాడుతూ దశాబ్దాలుగా దేశంలో పోటీ పరీక్షల ముసుగులో సాగుతున్న లక్షల కోట్ల రూపాయల దోపిడీ బండారాన్ని ‘బొద్దింకల' ఆందోళన బయట పెట్టిందన్నారు. భవిష్యత్తులో ఇదే తరహాలో మరిన్ని ఉద్యమాలు జరగడం ఖాయమని, కార్పొరేట్ మతోన్మాద ఆదిపత్యానికి కాలం చెల్లిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ మాట్లాడుతూ యువతకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, నిలదీస్తాం, పోరాటం చేస్తామన్న హెచ్చరికను ఈ పోరాటం పంపిందని పేర్కొన్నారు. యువత సమస్యను వారే గుర్తించి పరిష్కారం కూడా వారే కనుక్కున్నారన్నారు. ఉద్యమాల దిశ మారిందని తెలిపారు. విద్యావ్యవస్థలో వ్యాపార ధోరణి పెరిగిపోయిందన్నారు.

అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అరసం జిల్లా అధ్యక్షులు ఉప్పల అప్పలరాజు, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు పొలమరశెట్టి ఫ్రాన్సిస్, విశాఖ రచయితల సంఘం అధ్యక్షులు అడపా రామకృష్ణ, విశాఖ సాహితీ కార్యదర్శి చిన సూర్యనారాయణ, ఉసిరికాయల అప్పలరాజు, జెవి.ప్రభాకర్, పొలమరశెట్టి నిర్మల రాజు, జి.రాజేశ్వరరావు, రవిశంకర్ పతివాడ, నాస్తిక సమాజం ప్రతినిధి రామకృష్ణ, బొడ్డ కూర్మారావు, బసు పోతన రాజేష్, కె.చంద్రమోహన్, కార్మిక నాయకులు బొడ్డేటి సత్య నారాయణ, చిత్రకారుడు సూర్యారావు, రాంప్రభు పాల్గొన్నారు. దాదాపు ఇరవై మంది కవులు కవిత్వం చదివారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్