వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ ప్రారంభం
ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలోని మైనారిటీ యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సిఇడిఎం) నూతన కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమనే సంకల్పంతో ప్రభుత్వం మైనారిటీల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సిఇడిఎం ద్వారా మైనారిటీ యువత కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన అధ్యాపకులతో ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఎక్కడ ఉన్నా నాణ్యమైన శిక్షణ అందించడం, మైనారిటీ యువతను ఉద్యోగార్థులుగానే కాకుండా పారిశ్రామికవేత్తలుగా, నవతరం నాయకులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అహ్మద్ షరీఫ్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)