పల్నాడు జిల్లాలో విషాదం
ప్రజాశక్తి - అమరావతి (పల్నాడు జిల్లా) : చెరువులో దిగిన ఆవును రక్షించబోయి ఇద్దరు వేదపాఠశాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బుధవారం పల్నాడు జిల్లా అమరావతి మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన కొడవటికంటి రమేష్ కుమారుడు కిరణ్ (17), రాజమండ్రికి చెందిన భవిడి శివనాగ సుబ్రహ్మణ్యం (17) ఎండ్రాయి గ్రామంలో శ్రీ గీత వెంకటేశ్వర వేద పాఠశాలలో ఆరవ సంవత్సరం చదువుతున్నారు. ఆశ్రమానికి చెందిన ఆవు చెరువులో దిగగా దానికి తీసుకొచ్చేందుకు కిరణ్, సుబ్రహ్మణ్యం దిగారు. ఈ క్రమంలో చెరువు లోతును అంచనా వేయలేకపోవడంతో ఇద్దరూ ప్రమాదవశాత్తూ నీట మునిగిపోయారు. గమనించిన స్థానికులు వారిని బయటకుతీసి అమరావతి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే విద్యార్థులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడవటికంటి కిరణ్ ఆరు సంవత్సరాల క్రితం వేదపాఠశాలలో చేరారని, ఈ సంవత్సరంతో చదువు పూర్తవుతుందని తెలిసింది. మరో విద్యార్థి భవిడి శివ నాగ సుబ్రహ్మణ్యంది రాజమండ్రి అని, అతను ఐదేళ్లుగా అక్కడి వేదపాఠశాలలో చదువుకున్నారని, ఆఖరి సంవత్సరం గీత వేంకటేశ్వర వేద పాఠశాలలో చేరారని తెలిసింది. తల్లిదండ్రులకు సమాచారం అందజేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.








కామెంట్‌లు (0)