బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌

1 గంట క్రితం

Killo Surendra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర

ప్రజాశక్తి- అరకులోయ (అల్లూరి జిల్లా) : 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ఇంప్లీడ్‌ పిటిషన్ (కేసు నెంబర్ 16069/2026) దాఖలు చేసినట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు. అరకులోయలోని గిరిజన భవన్‌‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. జిఒ నెంబర్ 3 చట్టబద్ధత, 1/70 చట్టం పరిరక్షణకు ఈ నెల 17న పాడేరు ఐటిడిఎ వద్ద జరిగిన గిరిజన గర్జన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు జారీ చేసిన డిసిప్లినరీ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

జిఒ నెంబర్‌ 3 చట్టబద్ధత హామీ అమలేదీ?

పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాలతో మంగళవారం జరిగిన సమావేశంలో జిఒ నెంబర్‌ 3కి ప్రత్యామ్నాయ జిఒ, 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు వంటి అంశాలపై ఎటువంటి నిర్దిష్ట హామీ ఇవ్వకుండా దాటవేశారని సురేంద్ర తెలిపారు. ఇది ఉద్యమాన్ని చల్లార్చడానికి ఏర్పాటు చేసిన సమావేశం తప్ప, మరొకటి కాదని పేర్కొన్నారు. చంద్రబాబు హామీ ఇచ్చి రెండేళ్లు దాటినా జిఒ నెంబర్‌ 3 చట్టబద్ధతకు నేటికీ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. 1/70 చట్టానికి వ్యతిరేకంగా 2,023 జనవరిలో1,670 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా చంద్రబాబు సర్కారు నేటికీ సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంలో ఆంతర్యమేంటని సురేంద్ర ప్రశ్నించారు. ఈ సమావేశంలో సంఘం అల్లూరి జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్, నాయకులు జి.బుజ్జిబాబు, కె.రమేష్, కె.బుజ్జి బాబు, జి.రాజు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్