సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మీనమేషాలు

11 సెప్టెంబర్, 2026

Zero movement in various branches
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:55 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- వివిధ శాఖల్లో కదలిక శూన్యం

- మూడేళ్లుగా అధ్యాపకులకు తప్పని నిరీక్షణ

ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. యాక్ట్ 30 అమలులోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న వేలాది మంది అధ్యాపకులలో ఒక్కర్నీ కూడా ఇంత వరకూ రెగ్యులర్ చేయలేదు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిలిచిపోయిన ప్రక్రియను ప్రభుత్వం ఇటీవల పున: ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, సర్క్యులర్‌ జారీ చేసింది. నిధి పోర్టల్‌ ‌తిరిగి ఓపెన్‌ ‌చేసి, ఉద్యోగుల వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ అందుకు అనుగుణంగా ఆయా శాఖల్లో ఫైళ్లు ముందుకు కదలడం లేదు.

కమిషనరేట్‌, ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ, ట్రెజరీ, ఫైనాన్స్‌ ఇలా ఉద్యోగుల వివరాలు నాలుగు దశలు దాటాల్సి ఉంటుంది. కానీ ఒక్కో శాఖలో నెలల తరబడి పెండింగ్‌‌లో ఉంటున్నాయి. కొన్ని శాఖల్లో ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీలకు సంబంధించిన అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ప్రభుత్వం విధించిన గడువు సెప్టెంబర్‌‌తో ముగుస్తుండడం, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ ‌వస్తుండడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ యాక్ట్ 30ను 2023 అక్టోబర్‌‌లో ప్రభుత్వం తీసుకొచ్చి, 170 శాఖల్లో పనిచేస్తున్న 10,117 మందిని రెగ్యులర్ చేయాలని నిర్ణయించింది. అయితే 2024లో ఎన్నికల కోడ్‌ ‌వచ్చే నాటికి వైద్య ఆరోగ్యశాఖ, ట్రైబల్‌ ‌వెల్ఫేర్‌, అటవీ శాఖ, సాంకేతిక విద్య ఇతర కొన్ని శాఖల్లో సుమారు 3350 మందిని మాత్రమే రెగ్యులర్‌ చేయగా, వారిలో సుమారు 2800 మంది వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేస్తామని ఎన్నికలు పూర్తయ్యాక నూతన ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాదాపు రెండేళ్ల పాలన తర్వాత ఇటీవల జూన్‌‌లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పున:ప్రారంభించి, జులై నెలారులోగా పూర్తి చేయాలని మొదట సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ తేదీకి పూర్తి కాకపోవడంతో మరోసారి గడువు పెంచి సెప్టెంబర్‌ ఆఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఇప్పుడు కూడా ఆయా శాఖల అధికారులు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ ‌కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు ఐదు వేల మంది కాంట్రాక్టు అధ్యాపకులలో మూడేళ్లలో ఒక్కర్నీ కూడా రెగ్యులర్‌ ‌చేయలేదు. మొత్తం ప్రభుత్వం గుర్తించిన సంఖ్యలో దాదాపు సగం మంది ఉన్న అధ్యాపకులను పట్టించుకోకపోవడం శోచనీయం. ఇటీవల నిధి పోర్టల్‌ తిరిగి ఓపెన్‌ ‌చేయడంతో తమకు న్యాయం జరుగుతుందని అధ్యాపకులు అంతా భావించారు. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా అధికారుల తీరు ఉంది. ఈ నెల ఐదున ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చర్చల సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగుల గురించి కనీస ప్రస్తావన లేకపోవడం గర్హనీయం. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖల్లో కొంతమందికి రెగ్యులర్‌ ఉత్తర్వులు దక్కాయి. దీంతో మిగిలిన వారు కూడా కోర్టును ఆశ్రయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా యాక్టు 30ని సవరించి, వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మొదటి నుండి యాక్టు పరిధిలో ఉన్న వేలాది మంది అధ్యాపకులను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అన్ని శాఖల్లోనూ తక్షణమే రెగ్యులరైజేషన్‌ ‌ప్రక్రియ పూర్తి చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్