ప్రజాశక్తి - యంత్రాంగం : వడదెబ్బకు గురై వేర్వేరు జిల్లాల్లో ఆదివారం ఏడుగురు మృతిచెందారు. ఎండల తీవ్రతకు ఎక్కడివారక్కడే కుప్పకూలిపోతున్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరులో ఇద్దరు మృతి చెందారు. మండల పరిధిలోని బంజరుగూడేనికి చెందిన గౌర్ల పెరుమాళ్లు (82) ఎండలో కిరాణా కొట్టుకు వెళ్లి ఇంటికొచ్చి దాహం దాహం అంటూ కుప్పకూలి ఇంట్లోనే మృతి చెందారు. పెరుమాళ్లు సిపిఐలో సుదీర్ఘకాలంగా ఆయన పని చేస్తున్నారు. మండల పరిధిలోని తొండిపాక పంచాయతీ మిట్టగూడెం గ్రామానికి చెందిన నోముల వంశీ (30) ఫ్రైడ్ రైస్ హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఎండలో షాపు నుండి ఇంటికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బూర్గంపాడు ప్రభుత్వాస్పత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. నూజివీడు మండలం సీతారామపురం గ్రామంలో కౌలు రైతు బొద్దు కోళ్ల జయరాజు (57) వడదెబ్బకు మరణించారు. ఎప్పటిలానే పొలం పనులు చూసుకుని ఇంటికి తిరిగొస్తుండగా ఎండ తీవ్రతకు కుప్పకూలి అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. స్థానికులు సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన విప్పర్ల జయమణి (75) వడదెబ్బకు గురై మరణించారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో వడదెబ్బతో సయ్యపురెడ్డి కొండబాబు (50) మృతిచెందారు. ఆయన ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రతిరోజులాగే ఆటోను వడ్డాది జంక్షన్లో సీరియల్లో పెట్టి ప్రయాణికుల కోసం చూస్తున్నారు. ఉన్నట్టుండి ఎండ తీవ్రతకు కుప్పకూలి పడిపోయారు. సమీపంలోని వారు స్పందించి ఆస్పత్రికి తరలించేసరికే మృతిచెందారు. కృష్ణాజిల్లా ఉయ్యూరు విజయ ఆస్పత్రి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తి అప్పటికే మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వ్యక్తి వయస్సు 35 నుండి 40 సంత్సరాలు ఉంటుందని, వడద్బెకు గురై మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెడనలో బండారులంక శ్రీనివాసరావు (49) తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నారు. వడదెబ్బకు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందారు. వడదెబ్బతో మృతి చెందినట్లు మచిలీపట్నం సర్వజన ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ తోట లీల ప్రసాద్ తెలిపారు.
వడదెబ్బకు గురై ఏడుగురు మృతి
24 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 25, 2026, 12:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్లు (0)