ప్రజాశక్తి - పరవాడ (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అరబిందో పరిశ్రమలోని 15వ విభాగంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్పత్తి భవనం వద్ద మంటలు చెలరేగి పొగలు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళన నెలకొంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసుల కథనం మేరకు.. అరబిందో పరిశ్రమలో మధుమేహ వ్యాధి చికిత్సకు ఉపయోగించే మెట్ఫార్మిన్ ఔషధాన్ని తయారు చేస్తారు. మాత్రలను ఒత్తిడి ద్వారా తయారు చేసే యంత్రాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వినియోగం కారణంగా స్థిర విద్యుత్ ఆవేశం ఏర్పడి తొలుత మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసు సిబ్బంది, అనకాపల్లి జిల్లా కర్మాగారాల తనిఖీ అధికారి ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై ఆరా తీశారు.
సమగ్ర విచారణ జరపాలి : ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్
కంపెనీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ ప్రమాదంపై ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించాలని కోరారు. ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.








కామెంట్‌లు (0)