- రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి అపార అవకాశాలున్నాయని, భవిష్యత్తు అంతా ఈ రంగానిదేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖలో జరుగుతున్న 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని తెలిపారు. భారతదేశంలోని పర్యాటక వైవిధ్యమంతా ఎపిలోనే చూడవచ్చని పేర్కొన్నారు. సదస్సు రెండో రోజు పర్యాటక రంగంలో రూ.860 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులకు ఎంఒయులు, రూ.336 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులకు జిఒల మార్పిడి చేశారు. హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు కుప్పం, కర్నూలు, విజయనగరం, రాజమహేంద్రవరం, విశాఖ తదితర ప్రాంతాల్లో ఒప్పందాలు కుదిరాయి.
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల పెట్టుబడిదారులకు పరిశ్రమల తరహా రాయితీలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. గత రెండున్నరేళ్లలో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల సముద్రతీరం, అరకు, లంబసింగి, గండికోట, కోనసీమ, బౌద్ధ క్షేత్రాలు పర్యాటక అభివృద్ధికి ఎంతో అనుకూలమన్నారు. స్థానిక యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఐదు ప్రాంతీయ సదస్సులు, సిఐఐ సమ్మిట్ ద్వారా మొత్తం 62 పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రూ.7,287.30 కోట్ల పెట్టుబడులు, 46,853 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని మంత్రి వివరించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్.రావత్, కార్యదర్శి ఆమ్రపాలి కాట, టూరిజం ఎమ్‌డి పట్టాన్‌శెట్టి రవి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)