- ఐదుగురు కార్మికులు దుర్మరణం
- చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
- మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియో : కలెక్టర్ ప్రకటన
- యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యాన పరిశ్రమ వద్ద ధర్నా
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో, సత్యవేడు : తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలోని ట్యాబ్లేట్ ఇండియా లిమిటెడ్ (టిల్) హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాంధీ సందర్భంగా అక్టోబర్ రెండున ఈ పరిశ్రమకు సెలవు ప్రకటించారు. దీంతో, శనివారం విధుల్లో తక్కువ ముందే ఉన్నారు. లేకపోతే మృతుల సంఖ్య భారీ పెరిగేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి, డిప్యూటీ సిఎం కె.పవన్ కల్యాణ్, తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున, గాయపడిన వారికి రూ.25 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియో చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల చొప్పున పరిహారం రెండు రోజుల్లో ఇవ్వనున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ప్రకటించారు. తోటి కార్మికుల కథనం ప్రకారం... శ్రీసిటీలోని ట్యాబ్లేట్ ఇండియా లిమిటెడ్ (టిల్) హెల్త్ కేర్ పరిశ్రమలో అక్టోబర్ రెండున సెలవు అనంతరం శనివారం ఉదయం 6.30 గంటలకు బాయిలర్‌ను ఆన్‌చేశారు. రెండు టన్నుల సామర్థ్యం ఉన్న ఈ బాయిలర్‌లో 8.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. బాయిలర్ వద్ద పనిచేస్తున్న సత్యవేడు మండలం చెరివి గ్రామానికి చెందిన చిన్న మస్తాన్ (45), తమిళనాడులోని మాదరపాక్కం గ్రామానికి చెందిన రమేష్ (45) అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తడా ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో వారిలో తమిళనాడులోని కుప్పానాయుడు గ్రామానికి చెందిన మోహన్ రాజు (20), పశ్చిమబెంగాల్ కు చెందిన గౌరబ్ రాయ్ (36) మరణించారు. చెన్నయ్‌లోని అపోలో ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ తిరుపతి జిల్లా తడకు చెందిన బాయిలర్ ఆపరేటర్ వాసు (33) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఓ మహిళ అదే ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్నారు. బాయిలర్‌లో నీరు సరిపడా లేకపోవడమే పేలుడుకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బాయిలర్ పేలుడుతో అది ఉన్న ప్రాంతం ధ్వంసమైంది. ఫ్యాక్టరీ గోడలు కూలిపోయాయి. పరిశ్రమలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అద్దాలు, తలుపులు దెబ్బతిన్నాయి. దీనిని బట్టి పేలుడు ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్‌పి సుబ్బరాయుడు పరిశీలించారు. ఇక్కడ తయారైన మందులను ఈ పరిశ్రమ విదేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని, సహాయ చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు : కలెక్టర్
ఈ ఘటనపై విచారణకు బాయిలర్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు అంత్యక్రియల నిమిత్తం రూ.లక్ష చొప్పున అందజేసినట్లు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన తిరుపతి బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. గత 18 ఏళ్లలో శ్రీసిటీలో ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే తొలిశారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి శ్రీసిటీలోని అన్ని పరిశ్రమల్లో వెంటనే థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని, దహన సంస్కారాల కోసం శ్రీసిటీ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. మృతుల పిల్లల ఉన్నత చదువులతో సహా అన్ని విద్యా ఖర్చులను శ్రీసిటీ యాజమాన్యమే భరిస్తుందని చెప్పారు. అర్హులైన కుటుంబ సభ్యులకు శ్రీసిటీ లేదా పరిసర పరిశ్రమల్లో తక్షణమే ఉద్యోగావకాశం కల్పిస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, సూళ్లూరుపేట ఆర్‌డిఒ దేవేందర్ రెడ్డి, శ్రీ సిటీ ఎండి రవి సన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర దర్యాప్తు జరపాలని సిఐటియు ధర్నా
ఈ ప్రమాదం నేపథ్యంలో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పరిశ్రమ వద్ద సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. జయచంద్ర, టి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఘటనకు బాధ్యుని చేస్తూ ఒక చిన్న అధికారిపై చర్యలు తీసుకోవడంతో సరిపెట్టకుండా భద్రతా ప్రమాణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. నివాస ప్రాంతాలకు సమీపంలో ఫార్మా పరిశ్రమలు ఉండకూడదనే విధానం ఉన్నప్పటికీ, ఇక్కడ పరిశ్రమకు అనుమతులు ఎలా ఇచ్చారో విచారణ జరపాలని మురళి కోరారు. అనంతరం చెరివి గ్రామంలో మృతుడు మస్తాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దీనికి ముందు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఈ పరిశ్రమ కార్మికులతో మాట్లాడారు. సంఘటనా స్థలాన్ని ఎఐటియుసి నేతలు చినిరాజు, ధనంజయ చౌదరి సందర్శించారు.
మృతుల కుటుంబాల నేపథ్యం
చిన్న మస్తాన్ కు భార్య శ్రీదేవి ఉన్నారు. వారి కుమార్తె నీలిమ డిగ్రీ సెకండియర్, కొడుకు మహేందర్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కుటుంబానికి ఆధారమైన ఆయన గత నెల 26న గోవిందమాల వేశారు. ఈ నెల 21న కొండకు ఇంటిల్లిపాది వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో వారి కుటుంబం రోదన వర్ణనాతీతంగా ఉంది. గౌరబ్ రాయ్ వలస కార్మికుడు. చెరివిలోనే గదిలో నివాసం ఉంటున్నారు. తోటి స్నేహితులతో వలస వచ్చారు. ఆయన స్నేహితుడు సాకీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చామని, గదిలో ఉంటూ ఇక్కడే పనిచేసుకుంటున్నామని చెప్పారు. రోజువారి కూలి కింద ఏడాదిగా పనిచేస్తున్నామని తెలిపారు. గౌరబ్ రాయ్ కు, మోహన్ రాజు అవాహితులు. మోహన్ రాజుపై ఆధారపడి కుటుంబసభ్యులు ఆరుగురు ఉన్నారు. వాసుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒంగోలు నుంచి 22 ఏళ్ల క్రితం వలస వచ్చారు.










కామెంట్‌లు (0)