శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్సి, ఎస్టిలకు కేటాయించిన పారిశ్రామిక ప్లాట్ల రద్దు తగదు

21 అక్టోబర్, 2026

plates
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 08:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎపి ఎస్సి, ఎస్టి పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకాల కమిటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఎపిఐఐసి అభివృద్ధి పరిచిన పారిశ్రామిక వాడల్లో ఎస్సి, ఎస్టిలకు కేటాయించిన ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని ఎపి ఎస్సి, ఎస్టి పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకాల కమిటీ చైర్మన్ ఇ.అనార్ బాబు పేర్కొన్నారు. రద్దు చేసిన ప్లాట్లను పునరుద్ధరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన బుధవారం లేఖ రాశారు. ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, యువరాజ్‌, ఎపిఐఐసి ఎండి దినేష్‌ ‌కుమార్‌‌కు సైతం ఈ లేఖలు పంపించారు. మొత్తం 1600 మంది ఎస్సి, ఎస్టిలకు నగదు చెల్లించుకునేందుకు నెల రోజులు, పరిశ్రమల స్థాపనకు 4 నెలలు మాత్రమే గడువు ఇచ్చారని, ఈ సమయం సరిపోనందున ఎక్కువమంది నగదు చెల్లించలేకపోయారని లేఖలో పేర్కొన్నారు. ఎపిఐఐసి నిబంధనల ప్రకారం 90 రోజులపాటు నగదు చెల్లించేందుకు, ఏడాది పాటు పరిశ్రమ స్థాపనకు అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. ఎస్సి, ఎస్టి పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు విడుదలో జాప్యం, బ్యాంకులలో రుణాలు అందక ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. వరుసగా నోటీసులు ఇస్తూ బాగా ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదన్నారు. గత నెల 11వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈ నెల 10వ తేదీలోపు అమౌంట్ మొత్తం చెల్లించాలని షరతు విధించినట్లు చెప్పారు. ఈ పారిశ్రామికవేత్తలకు రావలసిన రాయితీలను ఎపిఐఐసి ప్లాట్ లకు జమ చేసుకునే వెసులుబాటును కలిగించాలని పేర్కొన్నారు. మురిగిపోతున్న సబ్ ప్లాన్ నిధులనుంచి ప్లాట్లకు నిధులు కేటాయించవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఎపిఐఐసి చేసే రిజిస్ట్రేషన్ విధానం కారణంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది సందిగ్ధంలో ఉన్న కారణంగా నగదును కూడా చెల్లించలేక పోయారని తెలిపారు.

‌ప్లాట్ల రద్దును ఖండించిన కెవిపిఎస్‌

రాష్ట్రంలో ఎపిఐఐసి అభివృద్ధి చేసిన పారిశ్రామిక వాడల్లో ఎస్సి, ఎస్టి పారిశ్రామికవేత్తలకు కేటాయించిన ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం తీవ్ర అన్యాయమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపియస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,600 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఉన్నారని, వారందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎస్సి, ఎస్టిలకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొందని తెలిపారు. ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని రద్దు చేసిన ప్లాట్లను పునరుద్ధరించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్