రూ.5,217 కోట్ల పెట్టుబడులతో 23 ఎంఒయులు
ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అనంతపురంలో నిర్వహించిన సిఐఐ నాలుగో ప్రాంతీయ సదస్సులో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఆటో విడిభాగాలు, ఏరోస్పేస్, రక్షణ, ఉక్కు, వస్త్ర తదితర రంగాల్లో రూ.5,217.39 కోట్ల పెట్టుబడులతో 23 అవగాహనా ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటి ద్వారా 7,613 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు ప్రకటించారు. రాబోయే 31వ సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ను పురస్కరించుకుని జెఎన్టియు అనంతపురం వేదికగా విశ్వవిద్యాలయం పరిధిలోని ఎన్టిఆర్ ఆడిటోరియంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రాంతీయ సదస్సుకు ఉన్నతాధికారులు, ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. మొత్తం 23 ఒప్పందాలలో ఈ ప్రాంత జిల్లాలైన అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప పరిధిలో రూ.4,141.39 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా 6,374 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, మిగిలిన తొమ్మిది ప్రాజెక్టులు అనకాపల్లి నుంచి చిత్తూరు వరకూ ఇతర జిల్లాల్లో విస్తరించనున్నాయని ఈ సమ్మిట్‌లో వక్తలు పేర్కొన్నారు.
ఏరోస్పేస్, ఆటో రంగాల్లో ఒప్పందాల వివరాలు..
ఆటో విడిభాగాలు: కియా అనుబంధ సంస్థ 'హ్వాషిన్ ఆటోమోటివ్' శ్రీసత్యసాయి జిల్లాలో రూ.850 కోట్లతో ఫోర్ వీలర్ విడిభాగాల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. 'సియాన్ ఇ-హ్వా సమిట్ ఆటోమోటివ్' రూ.514.17 కోట్లు (918 ఉద్యోగాలు), కర్నూలులో 'ఇవామెట్ ఇండియా' రూ.250 కోట్లతో యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి.
రక్షణ, ఏరోస్పేస్: కర్నూలు జిల్లాలో 'అజిస్టా కంపోజిట్స్' రూ.810 కోట్లతో ఏరోస్పేస్ కాంప్లెక్స్ నెలకొల్పనుంది. వీరా టాక్టికల్ డినమిక్స్ (రూ.165 కోట్లు), స్టార్మింగ్ యూనివర్స్ డ్రోన్ తయారీ (రూ.50 కోట్లు), మెల్‌స్టార్ ఏవియేషన్స్ (రూ.20 కోట్లు) ఒప్పందాలు చేసుకున్నాయి.
ఉక్కు, జౌళి: హరిఓం పైప్స్ అనంతపురంలో రూ.700 కోట్లతో సమగ్ర ఉక్కు కర్మాగారాన్ని (1,100 ఉద్యోగాలు), స్టీడ్ఫాస్ట్ స్టీల్స్ కర్నూలులో రూ.536 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. వస్త్ర రంగంలో మహాజన్ టెక్స్టైల్స్, ఉన్నతి టెక్స్టైల్స్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి (1,400 మందికి పైగా) కల్పించనున్నాయి.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్: రాయలసీమను పండ్ల తోటల హబ్‌గా మార్చేందుకు రూ.లక్ష కోట్లతో ప్రైవేట్ భాగస్వామ్య ప్రణాళికను అధికారులు వివరించారు. ఇందులో భాగంగా చిత్తూరులో నకోడా డెయిరీ రూ.340 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది.
నాలుగు సదస్సులతో రూ.73,830 కోట్లు: విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, అనంతపురం ప్రాంతీయ సదస్సుల ద్వారా ఇప్పటివరకు మొత్తం 128 ఒప్పందాలు కుదిరాయని, వీటి మొత్తం విలువ రూ.73,829.74 కోట్లు కాగా, 1,35,362 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ సదస్సులో రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సిఇఒ సగిలి షన్మోహన్, ఎపిఐఐసి విసి, ఎండి ఎఎస్ దినేష్‌కుమార్, ఉద్యన, పట్టుపరిశ్రమల శాఖ సంచాలకులు డాక్టర్ కె శ్రీనివాసులు, అనంతపురం కలెక్టరు ఒ ఆనంద్, పరిశ్రమల శాఖ డైరెక్టరు శుభమ్ బన్సల్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)