ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాడిన మద్యం సీసాలు, బాటిళ్లు, క్యాన్ల పారవేత వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యకు పరిష్కారంగా సర్క్యులర్ ఎకానమీ విధానాలను అమలు చేసే అవకాశాలపై కార్యచరణ సిద్ధం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఎక్సైజ్ అధికారులకు సూచించింది. ఎక్సైజ్ విధానాలపై సూచనలు చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ఏడాది రాష్ట్రంలో సుమారు 215 కోట్ల మద్యం కంటైనర్లు విక్రయించబడినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 63 శాతం పీఈటీ బాటిళ్లు, 36 శాతం గాజు సీసాలు, ఒక శాతం క్యాన్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కంటైనర్లను సరైన విధంగా పారవేయకపోవడం వల్ల పర్యావరణం, ప్రజారోగ్యం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. సేకరణ, రీసైక్లింగ్, పునర్వినియోగం వంటి సర్క్యులర్ ఎకానమీ విధానాలు ఈ సమస్యను తగ్గించడంలో ఉపయోగపడతాయని పేర్కొంది. అయితే ఈ అంశంపై విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర అధ్యయనం అవసరమని మంత్రుల బృందం అభిప్రాయపడింది. ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా కీలకమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపాలని, వినియోగదారుల అవగాహన స్థాయిని అంచనా వేయాలని ఎక్సైజ్ శాఖను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. అధ్యయన నివేదిక, ఇతర రాష్ట్రాల అనుభవాలు, భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలతో కూడిన పూర్తి వివరాలను తదుపరి సమావేశంలో మంత్రుల బృందం ముందు ఉంచనున్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.








కామెంట్‌లు (0)