శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టీల్‌‌ప్లాంట్‌ మెయింటినెన్స్‌పై దృష్టి పెట్టాలి

1 గంట క్రితం

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 01:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిఎమ్‌‌డికి సిఐటియు వినతి

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌‌లో ఉత్పత్తి తగ్గడానికి‌ ప్రధాన కారణాలను గుర్తించి, మెయింటినెన్స్, క్లీనింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్టీల్‌ ‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ (‌సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రామస్వామి, జె.అయోధ్యరామ్‌ ‌కోరారు. ఈ మేరకు వారు స్టీల్‌‌ప్లాంట్‌ ‌చైర్మన్‌ ‌కమ్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యంత్రాల నిర్వహణలో నిర్లక్ష్యం, అనుభవజ్ఞులైన కార్మికుల కొరత వల్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలుగా ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లో మెయింటినెన్స్, క్లీనింగ్ పనులు సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. ఈ సమస్యను పలుమార్లు ప్లాంట్‌ ‌యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు.

ప్రత్యేకంగా కోక్ ఓవెన్ బ్యాటరీల నిర్వహణపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో ఒక బ్యాటరీలో 400కు పైగా పుషింగ్‌లు జరిగిన సందర్భాలు ఉండగా, ప్రస్తుతం 170 పుషింగ్‌లు కూడా జరగని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. బ్యాటరీల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, అవసరమైన మెయింటినెన్స్ పనులు చేపట్టకపోవడం ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. టిఎంసి విధానం అమలు సమయంలో అనుభవజ్ఞులైన కార్మికుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, మానవ వనరుల కొరత లేకుండా చూడాలని పలుమార్లు కోరినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. సింటర్ ప్లాంట్‌తో పాటు ఇతర విభాగాల్లోనూ మెయింటినెన్స్, క్లీనింగ్ పనులను నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో పలు ఇబ్బందులు, ప్రమాదాలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. నిర్వహణా లోపాల కారణంగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్లాంట్‌ను తిరిగి పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు మెయింటినెన్స్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అనుభవజ్ఞులైన కార్మికుల సేవలను వినియోగించుకోవాలని, కార్మికుల్లో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు తీసుకోవాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్