కొత్తగా టెక్స్టైల్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ సెల్ ఏర్పాటు
జిల్లాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి
జిల్లాల వారీగా చేనేత వస్త్ర పరిశ్రమల సామర్థ్యాన్ని గుర్తించి, వాటి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేందుకు ప్రభుత్వం మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిస్ట్రిక్ట్ లెడ్ టెక్స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ (డి ఎల్ టి టి) కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ టెక్స్టైల్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ సెల్, జిల్లాల్లో డిస్ట్రిక్ట్ టెక్స్టైల్ ప్లానింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని వాటి పరిధిలోనే డిస్ట్రిక్ట్ టెక్స్టైల్ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి జిల్లాకు స్టేట్ టెక్స్టైల్ ఫెసిలిటేషన్ ఆఫీసర్లను కూడా నియమించనున్నారు. దీనికోసం మార్గదర్శకాలను కూడా జారీ చేశారు.
పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా కార్యదర్శి దీనికి చైర్‌పర్సన్‌గా ఉంటారని, చేనేత శాఖ కమిషనర్ లేదా ప్రభుత్వం నియమించిన అధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని జిఓలో పేర్కొన్నారు. అలాగే ఆర్థిక, పరిశ్రమలు ఎంఎస్ఎంఇ శాఖల ప్రతినిధులతో పాటు కేంద్ర వస్త్రాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. జిల్లాల నుంచి వచ్చే అభివృద్ధి ప్రణాళికలను క్రోడీకరించి రాష్ట్ర వస్త్రాభివృద్ధి ప్రణాళికను రూపొందించడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, పురోగతిపై నివేదికలు సమర్పించడం ఈ సెల్ ప్రధాన బాధ్యతలు.
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు
ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన డిటిపిసిలను ఏర్పాటు చేయనున్నట్లు జిఓలో పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి దీనికి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. పరిశ్రమల కేంద్రం, చేనేత, వస్త్రాలు, ప్రణాళిక శాఖల ప్రతినిధులు, బ్యాంకులు, సహకార సంస్థలు, వస్త్ర పరిశ్రమలు, చేనేత, హస్తకళల రంగాల ప్రతినిధులు ఇందులో ఉంటారు. జిల్లా స్థాయిలో వస్త్ర రంగ అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం, ఐదేళ్ల ప్రణాళికలు, వార్షిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం, మౌలిక సదుపాయాలు, ఉత్పాదకత, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ అవకాశాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టడం ఈ కమిటీల విధులుగా నిర్ణయించారు.
క్షేత్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లు
డిటిపిసిల పరిధిలో టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్ లేదా ఆయన నియమించిన అధికారి వీటికి అధ్యక్షత వహిస్తారు. జిల్లా పరిశ్రమల అధికారి నోడల్ అధికారిగా ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వస్త్ర రంగ ఫెసిలిటేషన్ అధికారులు, స్థానిక పరిశ్రమల సంఘాలు, చేనేత క్లస్టర్లు, సహకార సంఘాలు, నేత కార్మికుల సంఘాలు, విద్యాసంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
క్షేత్రస్థాయిలో పరిశ్రమలు, చేనేత కార్మికులు, కళాకారులతో సంప్రదింపులు జరిపి వారి సమస్యలు, అవకాశాలను గుర్తిస్తారు. ఉత్పత్తి, ఉపాధి, ఎగుమతులు, మౌలిక సదుపాయాలు, శిక్షణ అవసరాలు, రుణ సదుపాయాలు, మార్కెట్ అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞాన లోపాలపై సమాచారాన్ని సేకరిస్తారు. జిల్లాల వారీగా టెక్స్టైల్ పొటెన్షియల్ మ్యాప్స్ రూపొందించి ఐదేళ్ల, వార్షిక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తారు.








కామెంట్లు (0)