శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అదాని’ బ్యాక్‌‌డోర్‌ ‌ఎంట్రీ కోసమేనా?

1 గంట క్రితం

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 11:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- షిప్పింగ్‌ ‌కంటైనర్ల తయారీ జాయింట్‌ ‌వెంచర్‌‌కు స్టీల్‌ ప్లాంట్‌ ‌ప్రకటన

- ‘ఉక్కు’ భూములను కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందంటూ కార్మికుల ఆగ్రహం

ప్రజాశక్తి- గ్రేటర్‌ ‌విశాఖ బ్యూరో: విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌యాజమాన్యం మరోసారి జాయింట్‌ ‌వెంచర్‌కు వెళ్తుండడం వెనుక పరోక్షగా అదానీకి మేలు చేసే కుట్ర దాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ డైరెక్షన్‌‌లోనే ఈ మేరకు యాజమాన్యం ముందుకు సాగుతోందంటూ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఒక్క స్పేర్‌ ‌పార్టునూ యాజమాన్యం కొనలేకపోతోంది. ఏటా జరగాల్సిన ఉక్కు ఆవిర్భావ దినోత్సవాన్నే ఘనంగా నిర్వహించుకోలేకపోతోంది. నెలల తరబడి కార్మికుల జీతాలు పెండింగ్‌ ‌పెడుతోంది. కనీసం నిర్వహణ ఖర్చులకూ నిధుల్లేక అల్లాడుతోంది. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే, షిప్పింగ్‌ ‌కంటైనర్ల తయారీ రంగంలోకి దిగేందుకు విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌ ‌సిద్ధమవుతోంది. భాగస్వామ్య సంస్థ కోసం ఈ నెల ఎనిమిదిన ఎక్స్‌‌ప్రెషన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌ (ఇఒఐ) ప్రకటన చేసింది. ఈ నెల 29 చివరి తేదీగా గడువు పెట్టింది. విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌ ‌కొత్త ప్రాజెక్టు, ఈ ప్రకటన వెనుక ‘అదాని’ ఎంట్రీ కోసం కేంద్రంలోని బిజెపి వేసిన స్కెచ్‌ ఉందని చర్చ నడుస్తోంది. కేంద్రం అడుగులకు మడుగులొత్తుతూ రాష్ర్టంలోని టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్‌ఎండిసి పేరుతో అప్పనంగా 1,150 ఎకరాల భూమిని అదానికి కట్టబెట్టింది. ఆ స్థలం పక్కనే మరో 51 ఎకరాలను అదానికి సమర్పించడానికే జాయింట్‌ ‌వెంచర్‌ ‌పేరుతో ఆగమేఘాల మీద స్టీల్‌‌ప్లాంట్‌‌తో ఇఒఐ ప్రకటన కేంద్రం ప్రభుత్వం చేయించిందనే చర్చ స్టీల్‌ ‌కార్మికుల్లో, ఈ ప్రాంత ప్రజల్లో నడుస్తోంది.

ఒక స్పేర్‌ ‌పార్టు కొనాలంటేనే....

ఒక స్పేర్‌ ‌పార్టు కొనాలంటేనే గడిచిన రెండేళ్లుగా స్టీల్‌ ‌యాజమాన్యం గజగజలాడుతోంది. ప్లాంట్‌‌కు, కార్మికులకు అవసరమైన పనులేవీ ముందుకు సాగడం లేదు. ఆర్థికలేమి పేరుతో యాజమాన్యం కాలయాపన చేస్తోంది. ఈ నేపథ్యంలో జాయింట్‌ ‌వెంచర్‌‌పై స్టీల్‌ ‌యాజమాన్యం ఇఒఐ విడుదల చేయడం, 20 రోజుల్లో పూర్తి కానుండడం వెనుక అదృశ్యహస్తం అదానియేనని కార్మికులు బాహాటంగా చెబుతున్నారు. కోక్‌ ఓవెన్‌ ‌బ్యాటరీ నిర్మించాలని పదేళ్లుగా కోరుతున్నా నేటికీ కేంద్రం నుంచి అనుమతి రాలేదు. ఉక్కు విస్తరణలో భాగంగా నిర్మించాల్సిన సిఎంకేస్‌ ‌ట్యూబ్‌ ‌మిల్లు ప్రైవేట్‌ ‌పరిశ్రమల ఒత్తిడితో పునాదుల్లోనే నిలిపేసింది. కానీ, నేడు ఆగమేఘాలపై కంటైనర్‌ ‌పరిశ్రమకు అన్ని అనుమతులూ కేంద్రం ఇచ్చేసింది. స్టీల్‌ ‌ప్లాంట్‌ దగ్గర భూమి తప్ప మరేమీ లేదు. ప్రధానంగా కంటైనర్‌‌కు అవసరమైన షీటు మిల్లు లేదు. అయినా, కంటైనర్‌ ‌తయారీ పరిశ్రమ ఏమిటి? ఈ ఇఒఐ ప్రకటన తర్వాత అదాని తాను కంటైనర్‌ తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటిస్తూ, విశాఖ ఉక్కు కంటైనర్‌ ‌పరిశ్రమ తయారీలోకి వస్తుందని, అవసరమైన సహకారం కావాలని కోరడం చూస్తే స్టీల్ ప్లాంట్‌ ఇఒఐ ప్రకటన వెనుక ప్రధాని-‘అదాని’ హస్తం ఉందనే స్పష్టమవుతోందని కార్మికులు అంటున్నారు.

​జాయింట్‌ ‌వెంచర్లతో నష్టపోయిన విశాఖ ఉక్కు

జాయింట్‌ ‌వెంచర్ల విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌‌ నష్టపోగా, బడా కార్పొరేట్లకు లాభం చేకూరిందనేది గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఐరన్‌ ఓర్‌ ‌కోసం 2011లో ఎన్‌ఎండిసిలో రూ.351 కోట్లు పెట్టుబడి పెట్టినా నేటికీ ఒక కేజి ఇనుప ఖనిజం కూడా స్టీల్‌‌ప్లాంట్‌‌కు రాలేదు. రైల్‌ ‌వీల్‌ ‌ప్లాంట్‌‌ను అత్యంత ఆధునిక సామర్థ్యంతో ఉత్తరప్రదేశ్‌‌లోని రాయబరేలిలో రూ.రెండు వేల కోట్ల స్టీల్‌ ‌నిధులతో నిర్మించినా లాభాల్లో ఉండగానే దీనిని కేంద్రం ప్రైవేట్‌‌కు అప్పగించింది. కేంద్రంలోని బిజెపి సర్కారే ప్లాంట్‌‌ను నష్టాల ఊబిలో పడేసే విధానం తీసుకుంది. తాజాగా అదానితో జాయింట్‌ ‌వెంచర్‌ ‌తప్పేలా లేదని, ఇది ప్లాంట్‌‌ను మరింత ముంచేస్తుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్