- తొమ్మిదిమందిపై ఎన్‌ఐఎ ఛార్జిషీటు
ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ ఆన్‌లైన్ ఉగ్ర కుట్ర కేసులో తొమ్మిది మంది నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విజయవాడలోని ప్రత్యేక కోర్టులో శనివారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. మహ్మద్ రహంతుల్లా షరీఫ్, మహ్మద్ డానిష్, మీర్జా సొహాయిల్ బేగ్, లక్కీ అహ్మద్, జిషాన్ అబ్దుల్ మజీద్, మీర్ ఆసిఫ్ ఆలీ, అబ్దుల్ సలాం, షారుక్ ఖాన్, షేక్ ఫయిజ్ ఉర్ రహ్మన్ అనే తొమ్మిది మందిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)-2023తోపాటు ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా)-1967 కింద దేశద్రోహం, నేరపూరిత కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్లు మోపింది. ఎన్‌ఐఎ దాఖలు చేసిన ఛార్జిషీటు ప్రకారం... నిందితులంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఐఎస్‌ఐఎస్) సభ్యులు, మద్దతుదారలని, దేశంలో హింసాత్మక జిహాద్ ద్వారా ‘ఖలీఫా’ పాలన తేవడానికి కుట్ర పన్నారు. వీరు అమాయక యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తీవ్రవాద సిద్ధాంతాలను ప్రచారం చేశారు. యువతకు ఆయుధ శిక్షణ ఇవ్వడానికి, ఐఇడి పేలుడు పదార్థాల తయారీకి ప్రాథమిక ఏర్పాట్లు చేసుకున్నారు. అంతర్గత సంభాషణల కోసం ఒక ప్రత్యేకమైన రహస్య కమ్యూనికేషన్ అప్లికేషన్‌ను సొంతంగా అభివృద్ధి చేసి వాడుకున్నారు. ఈ ఏడాది మార్చి 23న విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా ఎన్‌ఐఎ ఈ ఛార్జిషీట్ దాఖలు చేయగా, మిగిలిన నిందితులపై విచారణ కొనసాగుతోంది.








కామెంట్‌లు (0)