- ఎఫ్‌టిఒల సంఖ్య పెంచుతాం
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ప్రారంభం
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్ : కర్నూలును ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... రాష్ట్రంలో తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టిఒ) కర్నూలులో ఏర్పాటవడం చారిత్రాత్మక పరిణామమన్నారు. విమానాశ్రయాల నిర్మాణంతోపాటు పైలట్ శిక్షణ, విమానాల నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, ఎయిర్‌పోర్టు నిర్వహణ తదితర విభాగాలను అభివృద్ధి చేస్తూ సమగ్ర ఏవియేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం అకాడమీలో మూడు విమానాలు ఉన్నాయని, త్వరలో వాటి సంఖ్యను పదికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కర్నూలు వాతావరణ పరిస్థితులు, విమానాశ్రయ సౌకర్యాలు పైలట్ శిక్షణకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం సుమారు 36 ఎఫ్‌టిఒలు ఉన్నాయని, రానున్న 10–15 ఏళ్లలో 25 వేల నుంచి 30 వేల మంది పైలట్లు అవసరమయ్యే అవకాశం ఉందని వివరించారు. విద్యార్థులు పైలట్ శిక్షణ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేశంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎఫ్ టిఒల శిక్షణ ప్రమాణాలు, నిర్వహణ నాణ్యతను పెంచేందుకు ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టామని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ అభివృద్ధికి అనుగుణంగా డిజిసిఎ కార్యకలాపాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ల నాణ్యతా పరీక్షలు, ధ్రువీకరణ వంటి కార్యకలాపాలను కర్నూలులోనే నిర్వహించేలా ప్రత్యేక విభాగం ఏర్పాటుపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. 2047 నాటికి 350కు పైగా విమానాశ్రయాలు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. విమానయాన సంస్థలతో చర్చించి కర్నూలుకు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మంత్రి బిసి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓర్వకల్లులో తొలి దశలో 180 ఎకరాల్లో, రెండో దశలో 400 ఎకరాల్లో డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్థానిక యువతకు అధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అకాడమీ నిర్వాహకులను కోరారు. మంత్రి టిజి భరత్ మాట్లాడుతూ... కర్నూలు–విజయవాడ మధ్య విమాన సర్వీసులను పెంచి ఉదయం, సాయంత్రం రోజువారీ సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. నైట్ ల్యాండింగ్, రన్‌వే సామర్థ్యం పెంపు, విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ.. ఎఫ్‌టిఒ ఏర్పాటుతో రాయలసీమ యువతకు విమానయాన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్, డైరెక్టర్ డాక్టర్ అశోక్ వర్గీస్, కర్నూలు విమానాశ్రయ డైరెక్టర్ విద్యాసాగర్, ఆర్ డిఒ సందీప్‌కుమార్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)