ప్రజాశక్తి , కడియం : ఆలయాల్లో లభించే పూల వ్యర్థాలు , కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ లో మిగులు పూలను సద్వినియోగం చేసి సుగంధ ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పూలతో అగరబత్తీలు, అత్తర్లు, పర్ఫ్యూమ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి ఉత్పత్తులు తయారు చేసి ‘టెంపుల్ ఎసెన్షియల్స్–రాజమహేంద్రవరం’ పేరుతో ప్రత్యేక బ్రాండ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ ఉత్పత్తులను యాత్రికులు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కడియంజీఎన్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఎలీప్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కన్నౌజ్‌కు చెందిన ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎఫ్‌ఎఫ్‌డీసీ) సాంకేతిక సహకారంతో నిర్వహిస్తున్న ఐదు రోజుల ‘టెంపుల్ ఎసెన్షియల్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’లో మూడో రోజు శిక్షణకు ఆమె గురువారం హాజరయ్యారు. శిక్షణ పొందుతున్న 35 మంది మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. మహిళలు కేవలం రుణాలు పొందడానికే పరిమితం కాకుండా సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదగాలని ఎంపీ అన్నారు. అలానే శిక్షణ పూర్తయిన తర్వాత కూడా మహిళలకు పరిశ్రమల ఏర్పాటుకు స్థలం, యంత్రాలు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ స్థానిక వనరులను ఉపయోగించుకుని మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. పూలు, తులసి, లెమన్‌గ్రాస్, రోజ్ తదితర సహజ వనరులతో సుగంధ ఉత్పత్తుల తయారీపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... స్థానికంగా లభించే పూలు, కొబ్బరి పీచు, అరటి తదితర ముడిసరుకులతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూరల్ పరిధిలో 20 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎఫ్‌డీసీ డైరెక్టర్ శక్తి వినయ్ శుక్లా , ఎలీప్ అధ్యక్షురాలు కె.రమాదేవి , సహాయ కలెక్టర్లు కె.ఆదిత్య శర్మ, ప్రియ, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ఆకుల శ్రీధర్, వెలుగుబంటి నాని, బోడపాటి గోపి, బొరుసు సుబ్రమణ్యం, నాగిరెడ్డి రామకృష్ణ, తాసిల్దార్ ఎమ్.శ్రీనివాస్, ఎంపీడీవో కె. రమేష్, డీఆర్‌డీఏ పీడీ బి.నగేష్, ఎలీప్, ఎఫ్‌ఎఫ్‌డీసీ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)