- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంస్కరణలతో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జి) బ్యాంక్ లింకేజీ కార్యక్రమంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఎంఎస్‌ఎంఇ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్ఆర్ఎల్ఎం తాజా గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబరు 15 నాటికి రాష్ట్రం రూ.15,229.40 కోట్ల రుణ పంపిణీ, రూ.82,639.56 కోట్ల రుణ నిల్వతో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే ముందంజలో నిలిచిందని మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందుతున్న ఈ రుణాలు కేవలం తాత్కాలిక సహాయంగా కాకుండా, కుటుంబాల ఆదాయాభివృద్ధికి, స్థిరమైన జీవనోపాధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డిజిటల్ సంస్కరణలతో పారదర్శకత, ఆర్థిక భద్రత, ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ, సభ్యుల గుర్తింపు ధృవీకరణ ద్వారా నకిలీ సభ్యత్వాలు, నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టడం జరుగుతుందన్నారు. విశిష్ట రిజిస్ట్రేషన్ నంబర్ విధానంలో ప్రతి సంఘానికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపునిచ్చి లావాదేవీల్లో పారదర్శకత పెంపొందిస్తామని తెలిపారు. రియల్‌టైమ్ డాష్‌బోర్డుల ద్వారా బ్యాంకు అధికారులు ఎస్‌హెచ్‌జి ప్రొఫైల్స్, గ్రేడింగ్, రుణ వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించే సదుపాయం ఏర్పాటుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ‘బ్యాంక్ సఖీల’ సహకారంతో మహిళలకు డిజిటల్ భద్రతపై అవగాహన కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్, సర్వీస్ ఛార్జీలు తగ్గించడం వల్ల ఒక్కో సంఘానికి ఏటా రూ.32,500 వరకు ఆదా అవుతోందని.. గతంలో 7 నుంచి 14.50 శాతం వరకు ఉన్న వడ్డీ రేట్లను ప్రామాణీకరించి 7 నుంచి 11.70 శాతానికి తగ్గించడంతో మహిళా సంఘాలపై రుణ వ్యయ భారం గణనీయంగా తగ్గిందన్నారు.






కామెంట్‌లు (0)