ఎపిలో రోజు కూలి రూ.312
తోతాపురి మామిడి రైతులకు కేంద్రం సాయం
‘విబి గ్రామ్ జీ` పథకం ప్రారంభోత్సవంలో *కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రజాశక్తి- పుల్లంపేట/ఓబులవారిపల్లి (తిరుపతి జిల్లా) : వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్ పథకంతో గ్రామాల రూపురేఖలు మారుస్తామని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉపాధి కార్మికులకు రోజు కూలి దేశవ్యాప్తంగా రూ.300కు, ఆంధ్రాలో రూ.312కు తగ్గదని హామీ ఇచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం (ఎంజిఎన్ రేగా) స్థానంలో తీసుకొచ్చిన దేశవ్యాప్తంగా అమలయ్యే విబి గ్రామ్ జీ పథకానికి తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లె గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి పలువురు మహిళలకు జాబ్ కార్డులను అందజేశారు. నీటి సంరక్షణకు సంబంధించి ఫొటో గ్యాలరీ సందర్శించారు. స్వచ్ఛ రథాలను పరిశీలించారు. విబి గ్రామ్ జీ పథకం సమాచార బుక్ లెట్ తో పాటు కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్‌ను సిఎం, డిప్యూటీ సిఎం, మిషన్ పోర్టల్ ను కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ విబి గ్రామ్ జీ పథకం కింద ఉపాధి కార్మికులకు ఏటా 125 పనిదినాలు కల్పిస్తామన్నారు. గ్రామీణాభివృద్ధికి కావాల్సిన ఏ పనైనా చేపట్టేందుకు ఈ పథకంలో అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రపదేశ్‌కు కేంద్రం రూ.7,700 కోట్ల నిధులు ఇవ్వనుందని, రాష్ట్రం మరో రూ.4 వేల కోట్ల నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనుందని వివరించారు. ఉపాధి పనుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేసేందుకు శ్రమిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో భుజం కలపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మామిడి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద 2.16 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి సేకరించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రకటించారు.
భారమైనా ఒకే : చంద్రబాబు
ఇప్పటి వరకూ మంగంపేట బెరైటీస్ గనులకే పరిమితమని, నేడు విబి గ్రామ్ జీ ప్రారంభించుకుని దేశానికి ఆదర్శమయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంజిఎన్ రేగా స్థానంలో తీసుకొచ్చిన విబి గ్రామ్ జీకి పథకంలో రాష్ట్రం 40 శాతం ఖర్చు చేయాల్సి ఉన్నా భారంగా కాకుండా బాధ్యతగా దీనిని అనుకుంటున్నామన్నారు. చెరువులు, కాల్వల మరమ్మతులు, ఇంకుడు గుంతలు, భూసార పరిరక్షణ, రోడ్లు, డ్రెయినేజీలు, మౌలిక వసతులతో పాటు పొలాలకు వెళ్లే రహదారులు కూడా ఈ నిధులతో నిర్మించుకునే అవకాశం ఉందని వివరించారు. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయని, పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి ప్రధాని మోడీతో కలిసి జాతికి అంకితం చేస్తామన్నారు. జమ్మలమడుగులో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు పునాది రాయి వేసి పనులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తోందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కలెక్టర్ సలిజాముల వెంకటేశ్వర్, కడప రూరల్ డెవలపప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)