- కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
- తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జల ప్రవేశం
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : దేశంలో ప్రధాన మారిటైమ్ ఇండస్ట్రియల్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్)లో తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్‌ఎస్‌ఎస్-1) ‘సూర్య’ను మంగళవారం ఆయన ప్రారంభిం చారు. ఇదే కార్యక్రమంలో ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్‌ఎస్‌ఎస్-5) నిర్మాణానికి కీల్ లేయింగ్ నిర్వహించారు. ఆధునీకరించిన స్లిప్‌వే-4, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గొలియత్ క్రేన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎఫ్‌ఎస్‌ఎస్-1 ప్రారంభం సాధించిన విజయానికి, ఎఫ్‌ఎస్‌ఎస్-5 కీల్ లేయింగ్ భవిష్యత్ సంకల్పానికి, కొత్త స్లిప్‌వే పెరుగుతున్న సామర్థ్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. ‘సూర్య’తో పాటు నిర్మించనున్న ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు సముద్రంలో దీర్ఘకాలం విధులు నిర్వహించే నౌకాదళానికి ఇంధనం, ఇతర ద్రవ పదార్థాలు, సరుకు, నిర్వహణ సహాయాన్ని -అందిస్తాయని తెలిపారు. అధునాతన కార్గో, ఫ్లూయిడ్ సామర్థ్యాలతో పాటు ప్రాథమిక నిర్వహణ వర్క్‌షాప్‌లు, మల్టీ-రోల్ హెలికాప్టర్ల కార్యకలాపాలకు అనువైన హెలికాప్టర్ డెక్, స్వీయ రక్షణ వ్యవస్థలు వీటిలో ఉంటాయని వివరించారు. స్వాతంత్య్రా నంతరం భారత్‌లో నిర్మించిన తొలి నౌక ‘జల ఉష’ను 1948లో విశాఖలోనే ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎనిమిది దశాబ్దాలుగా హెచ్‌ఎస్‌ఎల్ దేశ రక్షణ, సముద్ర రంగ అవసరాలకు సేవలందిస్తోందన్నారు. ఆధునీక రించిన స్లిప్‌వే-4తో 45 వేల డిడబ్ల్యూటి వరకు భారీ నౌకలను నిర్మించి ప్రారంభించే సామర్థ్యం హెచ్‌ఎస్‌ఎల్‌కు అందుబాటులోకి వచ్చిందన్నారు. స్లిప్‌వేలు 3, 4పై ఏర్పాటు చేసిన 300 టన్నుల గొలియత్ క్రేన్‌ను మేక్ ఇన్ ఇండియా కింద ఎల్‌అండ్‌టి జియోస్ట్రక్చర్, కోనెక్రేన్స్ సంస్థలు రూపొందించా యన్నారు. ఈ సదుపాయాలతో భారీ నౌకల నిర్మాణానికి అవసరమైన బ్లాకులను వేగంగా, కచ్చితత్వంతో తరలించేందుకు వీలవుతుందని తెలిపారు. నాణ్యత, వ్యయం, సాంకేతికత, సకాలంలో సరఫరా, విశ్వసనీయతలో ప్రపంచ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని భారత నౌకా నిర్మాణ సంస్థలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎంఎస్‌ఎంఇలు హెచ్‌ఎస్‌ఎల్‌కు సరఫరాదారులుగా ఎదగాలని, విశ్వవిద్యాలయాలు పరిశోధన, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. సాంకేతిక సంస్థలు డిజిటల్ షిప్‌బిల్డింగ్‌లో, స్టార్టప్‌లు సముద్ర సాంకేతికతలో భాగస్వాములు కావాలన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం, నేవల్ డాక్‌యార్డ్, హెచ్‌ఎస్‌ఎల్, విశాఖ పోర్టు వంటి కీలక సంస్థలు ఉన్నందున విశాఖను ప్రధాన మారిటైమ్ ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర మంత్రి బిసి.జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. హెచ్‌ఎస్‌ఎల్‌లో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ప్రారంభం భారతదేశ స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, విశాఖ ఎంపి శ్రీభరత్, రక్షణ ఉత్పత్తుల శాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్, తూర్పు నౌకాదళ కమాండ్ అధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, కోస్ట్‌గార్డ్ తూర్పు తీర కమాండర్ డానీ మైఖేల్, హెచ్‌ఎస్‌ఎల్ సిఎమ్‌డి రియర్ అడ్మిరల్ సి.రఘురామ్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)