ప్రజాశక్తి - విశాఖ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్‌ఎస్)తో అనుసంధానించిన వాయిస్ ఆధారిత ఈ-కంప్లైంట్ కియోస్క్‌లను విశాఖ రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని పోలీసు అవుట్ పోస్టుల వద్ద రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం ప్రారంభించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ మంచి కార్యక్రమానికి విశాఖ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు సుమారు 1.5 లక్షల మంది ప్రయాణిస్తారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే కియోస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. పిజిఆర్‌ఎస్‌తో అనుసంధానం చేయడం వల్ల ఫిర్యాదుల నమోదులో కచ్చితత్వంతో పాటు వాటి పరిష్కారాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా ఎపి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసులను ఛేదిస్తున్నారని తెలిపారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళల భద్రతలో విశాఖ మొదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. సిపి శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ప్రజలు ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించామని, పిజిఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదుల పురోగతిని పర్యవేక్షించవచ్చని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిసిపిలు, రైల్వే అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది ఎలా పనిచేస్తుందంటే...
ఈ కియోస్క్‌ల ద్వారా పోలీసు సిబ్బంది సహాయం లేకుండానే ప్రజలు మాట్లాడటం ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వాయిస్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, డిజిటల్ పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుని వివరాలు, సంఘటన జరిగిన ప్రదేశం, ఫిర్యాదు అంశాలను వాయిస్-టు-టెక్స్ట్ సాంకేతికతతో నమోదు చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిని గుర్తిస్తారు. ఫిర్యాదు నమోదైన వెంటనే ప్రత్యేక కంప్లయింట్ ఐడితో రశీదు, మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ ధ్రువీకరణ అందుతుంది.









కామెంట్‌లు (0)