‘ఉద్యోగ సాధన సంకల్ప దీక్షలు’ పోస్టర్ ఆవిష్కరణలో ఎ.వి.నాగేశ్వరరావు
ప్రజాశక్తి - ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో మూతపడిన 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవా (ఈసేవా) కేంద్రాలను వెంటనే తిరిగి ప్రారంభించి ఉపాధి కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎపి ‘ఇ’ (మీ) సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుండి చేపట్టనున్న ‘ఉద్యోగ సాధన సంకల్ప దీక్షలు’ పోస్టర్‌ను గురువారం విజయవాడలోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల్లో ఏర్పాటైన 170 ప్రభుత్వ అర్బన్ మీసేవా కేంద్రాల ద్వారా 607 మంది ఉద్యోగులు 376 రకాల సేవలను ప్రజలకు అందించారని గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వ శాఖలకు ఏడాదికి దాదాపు రూ.నాలుగు వేల కోట్లు, యూజర్ ఛార్జీల రూపంలో రూ.40 కోట్ల ఆదాయాన్ని సమకూర్చారని తెలిపారు. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి జీవో నంబర్ 2 ద్వారా ఐటి శాఖ పరిధిలోని ఈ సేవా వ్యవస్థను సచివాలయ శాఖకు బదిలీ చేసిందన్నారు. దీంతో ఈ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, తొలగించిన మీ సేవా ఉద్యోగులకు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 17 నుండి ఇఐడి కార్యాలయం వద్ద మూడు రోజులపాటు ‘ఉద్యోగ సాధన సంకల్ప దీక్షలు’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. పోస్టర్ ఆవిష్కరణలో సిఐటియు రాష్ట్ర నాయకులు ముజఫర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)