మంత్రి నిమ్మలకు వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పునరావాల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని, నిర్వాసిత కుటుంబాలలో 18 సంవత్సరాలు నిండిన యువతకు ప్యాకేజీ వర్తింపజేయడం, పెండింగ్ పరిహారం చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అద్యక్షురాలు డి రమాదేవి, రాష్ట రైతు సంఘం నాయకులు వై కేశవరావు, ఎం. సూర్యనారాయణ, జె. శివశంఖరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును గురువారం కలిసి వారు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 22న ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తున్నామని ఈలోగా ప్రజలందరూ గ్రామాలను ఖాళీ చేయాలని, జిల్లా కలక్టరు ప్రకటించటంతో ఆయా గ్రామాల ప్రజలు ఆంధోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ప్రకాశం జిల్లాలోని 11 గ్రామాల ప్రజలు తమ భూములు, ఇళ్లు, జీవనాధారాలను కోల్పోయి నిర్వాసితులుగా మారారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది. 2019 తర్వాత నిర్వాసిత కుటుంబాల్లో అప్పట్లో మైనర్లుగా ఉన్న పిల్లలు ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వతంత్ర కుటుంబ యూనిట్లుగా మారారని పేర్కొన్నారు. 2013 భూసేకరణ, న్యాయమైన నష్టపరిహారం, పునరావాసం, పునర్నిర్మాణ చట్టం స్ఫూర్తికి అనుగుణంగా ప్రభావిత కుటుంబాల జీవనోపాధి, గౌరవప్రదమైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామాల వారీగా అర్హుల జాబితాను తయారు చేసి బహిరంగంగా ప్రకటించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పరిహారం, పునరావాస ప్యాకేజీలను తక్షణమే చెల్లించాలి.
గజెట్ లోనూ, ఆ తర్వాత లబ్దిదారుల జాబితా చేరని కుటుంబాలు విజ్ఞప్తిని అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు. పునరావాస కాలనీలలో తాగునీరు, విద్యుత్, రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, పారిశుధ్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల గ్రృహ నిర్మాణం పూర్తి కాలేదని, వారు ఇళ్ళను అర్థాంతరంగా వదిలేసి బజారున పడాల్సిన స్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని, వారి నివాసాల కోసం కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. భూములు కోల్పోయిన కుటుంబాల యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, నిర్వాసిత సంఘాల ప్రతినిధులను అందులో చేర్చాలన్నారు. పలు ఇతర సమస్యలను ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.








కామెంట్‌లు (0)